Begin typing your search above and press return to search.

స్టార్ లింక్ శాటిలైట్లకు రష్యా గండం.. అదెలానంటే?

నిజామా? అబద్ధమా? అన్న ప్రశ్నలకు కొనసాగింపుగా ఇప్పుడు వచ్చిన ఒక నేరేషన్ ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.

By:  Garuda Media   |   23 Dec 2025 9:49 AM IST
స్టార్ లింక్ శాటిలైట్లకు రష్యా గండం.. అదెలానంటే?
X

నిజామా? అబద్ధమా? అన్న ప్రశ్నలకు కొనసాగింపుగా ఇప్పుడు వచ్చిన ఒక నేరేషన్ ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. ఆకాశంలో అల్లంత దూరాన ఉండే శాటిలైట్ల కారణంగా మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సేవల్ని అందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ వ్యవస్థను సింఫుల్ గా ధ్వంసం చేసే పరిస్థితులు ఏర్పడనున్నాయా? అదే జరిగితే.. ఎదురయ్యే ఉత్పాలకు శాంపిల్ గా తాజా పరిణామం ఒక ఉదాహరణ కానుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ కు చెందిన స్టార్ లింక్ సంస్థ తాజాగా తన సోషల్ మీడియా వేదికైన ఎక్స్ లో ఒక పోస్టు చేసింది. దీని సారాంశం.. అనూహ్య సాంకేతిక లోపం కారణంగా తమకు చెందిన శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి వాయువు విడుదలైందని.. దీంతో సదరు ఉపగ్రహం తన స్థిరత్వాన్ని కోల్పోయి.. కక్ష నుంచి అకస్మాత్తుగా కిందికి జారినట్లుగా పేర్కొంది. ఆ టైంలో శాటిలైట్ నుంచి కొన్ని చిన్నచిన్న శకలాలు బయటకు వచ్చాయని వెల్లడించింది తక్కువ వేగంతో కదిలే ఆ వస్తువుల్ని ట్రాక్ చేయొచ్చని పేర్కొన్న స్టార్ లింక్.. ఆ శాటిలైట్ త్వరలో భూవాతావరణంలోకి దూసుకు వస్తుందని చెప్పింది.

అయితే.. ఇలాంటి సమయాల్లో భూవాతావరణంలో ప్రవేశించినంతనే కాలిపోయేలా దీన్ని రూపొందించటం వల్ల పెద్ద ప్రమాదం లేదనే చెప్పాలి. కాకుంటే..ఈ ఘటన ఉత్తనే జరగలేదని.. దీని వెనుక రష్యా ఉందన్నదే ఇప్పుడు చర్చగా మారింది. ఉక్రెయిన్ తో నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధంలో దారుణంగా దెబ్బ తిన్న ఆ దేశం.. ఇప్పటికి ఇంటర్నెట్.. ఇతర కమ్యూనికేషన్ ఉపయోగించటానికి కారణం.. స్టార్ లింక్ శాటిలైట్లుగా చెబుతారు. ఈ నేపథ్యంలో ఆ శాటిలైట్లను ధ్వంసం చేస్తే ఉక్రెయిన్ వెన్ను విరవొచ్చన్న ఉద్దేశంతోనే రష్యానే ఇదంతా చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి

శాటిలైట్లను ధ్వంసం చేయటానికి జోన్ - ఎఫెక్ట్ అనే ఆయుధాన్ని రష్యా డెవలప్ చేసినట్లుగా నాటో దేశాల నిఘా వర్గాల నివేదికను కోట్ చేస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇదిప్పుడు పెను సంచలనంగా మారింది. పెల్లెట్లను ఉపయోగించి శాటిలైట్లను టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఒక వాదనను వినిపిస్తున్నారు. డిసెంబరు 17న స్టార్ లింక్ శాటిలైట్ తో సంబంధాలు తెగిపోవటం.. నాలుగైదు రోజుల్లోనే వచ్చిన ఈ కథనంతో స్టార్ లింక్ శాటిలైట్ కక్ష్య నుంచి జారిపోవటం వెనుక రష్యా హస్తం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ.. అదే నిజమైతే.. స్టార్ లింక్ సంస్థకు మాత్రమే కాదు.. ఈ సాంకేతికత ఉన్న వారి ప్రత్యర్థులకు ముప్పుగా మారుతుందని చెప్పాలి.

అయితే.. రష్యా అలాంటి పని చేసి ఉండదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకుంటే.. రోదసిలో అణ్వాయుధాల్ని మోహరించే ఉద్దేశం మాస్కోకు లేదని గతంలో పుతిన్ చెప్పిన నేపథ్యంలో అలా జరిగి ఉండదని భావిస్తున్నారు. నిజానికి ఈ తీరు ప్రపంచంలోని అన్ని దేశాలకు ముప్పే అవుతుంది. ఒక్క శాటిలైట్ ధ్వంసమైనా దాన్నుంచి వెలువడే శకలాలు ఆ కక్ష్య మొత్తాన్ని ప్రమాదకరమైన కిల్ జోన్ గా మార్చేసి.. మిగిలిన ఉపగ్రహాలను ధ్వంసం చేస్తాయని గుర్తు చేస్తున్నారు. తద్వారా సదరు కక్ష్య ఎందుకు పనికి రాకుండా పోతుందన్న మాట వినిపిస్తోంది. స్టార్ లింక్ ఉప గ్రహాలు భూమికి 550కి.మీ. ఎత్తులో పరిభ్రమిస్తుంటాయి. పెల్లెట్ల కారణంగా అవి పెద్ద సంఖ్యలో నియంత్రణ కోల్పోయి కిందకు జారటం మొదలైతే.. దాని కింద 400కి.మీ. ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. చైనాకు చెందిన స్పేస్ స్టేషన్ కు ముప్పు వాటిల్లుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా మీద అనుమానాలు వాస్తవం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది.