అంబానీ రేంజ్ చూసి మైండ్ బ్లాక్ అయిందో ఏమో.. భారత్‌లో కాలు పెట్టకముందే మస్క్ మాట మార్చేశాడు
అంతరిక్షంలో వేల ఉపగ్రహాలు వదిలినా.. ఇండియాలో ముకేశ్ అంబానీ నెట్‌వర్క్ దాటి రూపాయి కూడా అదనంగా పిండలేరు" అనే నిజాన్ని ఎట్టకేలకు ఎలన్ మస్క్ గ్రహించినట్లున్నారు.
By: A.N.Kumar | 11 Oct 2026 12:42 PM ISTఅంతరిక్షంలో వేల ఉపగ్రహాలు వదిలినా.. ఇండియాలో ముకేశ్ అంబానీ నెట్‌వర్క్ దాటి రూపాయి కూడా అదనంగా పిండలేరు" అనే నిజాన్ని ఎట్టకేలకు ఎలన్ మస్క్ గ్రహించినట్లున్నారు. అమెరికాలోలాగా అడిగినంత ఛార్జీలు గుంజేద్దాం అని ఆశపడ్డ స్టార్‌లింక్ బాస్.. భారత టెలికాం మార్కెట్లోకి కాలు పెట్టకముందే ప్లేట్ ఫిరాయించేశారు.
మన దేశంలో కూరగాయల కంటే చౌకగా లభించే మొబైల్ డేటాను, ఆఫర్ల వర్షం కురిపించే 'అంబానీ ఇంటర్నెట్ ఆర్మీ'ని చూసి లైట్‌గా మైండ్ బ్లాక్ అయిన మస్క్.. "అయ్యో భారత్‌లో మా సేవలు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయండి" అంటూ దిగొచ్చి చిలకపలుకులు పలుకుతున్నారు. అంతరిక్ష సాంకేతికతతో రాకెట్ స్పీడులో ఇంటర్నెట్ ఇస్తామన్నా ఇక్కడ 'తక్కువ ధర'కే మొదటి ప్రాధాన్యం అనే విషయం బోధపడటంతో.. శాటిలైట్ సేవలకు సైతం స్పెషల్ ఇండియన్ డిస్కౌంట్ వర్తింపజేయక తప్పని పరిస్థితి నెలకొంది.
భారత టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్.. ధరల విషయంలో కీలక సంకేతాలు ఇచ్చింది. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటు ధరల్లోనే ఉంటాయని మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే తక్కువ ధరలకు డేటా సేవలు అందిస్తున్న భారత టెలికాం కంపెనీల మధ్య స్టార్‌లింక్ ఎలా నిలదొక్కుకుంటుందన్న ప్రశ్నకు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ధరల విషయంలో వెనక్కి తగ్గినట్టేనా?
స్టార్‌లింక్ ఇంటర్నెట్ ధరలు ఎక్కువగా ఉంటే భారతీయ వినియోగదారులు వాటిని కొనుగోలు చేయరని మస్క్ అభిప్రాయపడ్డారు. అందుకే సేవలను ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు అందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ధరలు ఎంత ఉంటాయి? నెలవారీ చార్జీలు, పరికరాల ఖర్చు ఎంత మేరకు తగ్గుతాయి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
భారత్‌లో ఇంటర్నెట్ మార్కెట్ ఇతర దేశాలతో పోలిస్తే భిన్నమైనది. ఇక్కడ మొబైల్ డేటా తక్కువ ధరలకే లభిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులు సరసమైన ధరలకు 4G, 5G సేవలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ అధిక ధరలతో మార్కెట్‌లోకి వస్తే సాధారణ వినియోగదారులను ఆకర్షించడం సవాలుగా మారుతుంది.
అంబానీతో పోటీ.. మస్క్‌కు అసలైన పరీక్ష
రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ ఇప్పటికే భారత టెలికాం రంగంలో బలమైన స్థానాన్ని సంపాదించారు. తక్కువ ధరల డేటా ప్లాన్లు, విస్తృత నెట్‌వర్క్, భారీ వినియోగదారుల సంఖ్య జియోకు ప్రధాన బలాలు. మరోవైపు స్టార్‌లింక్ ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ముఖ్యంగా భూభాగంపై సంప్రదాయ నెట్‌వర్క్ ఏర్పాటు కష్టమైన మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ అందించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో జియోతో స్టార్‌లింక్ పోటీని కేవలం ధరల కోణంలోనే చూడలేం. ఒకవైపు తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఉంటే.. మరోవైపు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే ప్రత్యామ్నాయం ఉంది. ఈ రెండు సేవల వినియోగదారుల అవసరాలు అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండవు.
'అంబానీ ఇంటర్నెట్ ఆర్మీ'పై మస్క్ వ్యాఖ్యలు
స్టార్‌లింక్ ధరలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చకు స్పందిస్తూ 'అంబానీ ఇంటర్నెట్ ఆర్మీ' వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మస్క్ వ్యాఖ్యానించారు.. అంబానీ అందించే తక్కువ ధరలతో స్టార్‌లింక్ పోటీ పడలేదని చెబుతూనే మరోవైపు అది పోటీదారుగా మారుతుందని వాదిస్తున్నారు. పోటీ పెరిగితే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని.. అంబానీ లాభాలు తగ్గినా వ్యాపారం మూతపడిపోదని మస్క్ అభిప్రాయపడ్డారు.
భారత్‌లో స్టార్‌లింక్‌కు అవకాశాలెంత?
భారత్‌లో స్టార్‌లింక్ విజయాన్ని నిర్ణయించే అంశాలు ధరలకే పరిమితం కావు. సేవల లభ్యత, ఇంటర్నెట్ వేగం, వాతావరణ పరిస్థితుల్లో పనితీరు, పరికరాల కొనుగోలు ఖర్చు, నెలవారీ చార్జీలు, ప్రభుత్వ అనుమతులు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు సరిగా అందుబాటులో లేని ప్రాంతాల్లో స్టార్‌లింక్‌కు అవకాశాలు ఉండవచ్చు. అయితే నగరాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చౌకైన ఫైబర్ కనెక్షన్లతో పోటీ పడాలంటే ధరల విషయంలో మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అవసరం కావచ్చు.
చివరికి లాభపడేది వినియోగదారుడేనా?
స్టార్‌లింక్ భారత్‌లో సరసమైన ధరలకు సేవలు అందించగలిగితే శాటిలైట్ ఇంటర్నెట్‌కు కొత్త వినియోగదారులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పోటీ పెరగడం వల్ల ఇతర సంస్థలు కూడా తమ సేవలను మెరుగుపరచడం లేదా కొత్త ధరల ప్రణాళికలను ప్రవేశపెట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. అయితే పోటీ కారణంగా ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని ఇప్పుడే నిర్ధారించలేం.
మొత్తానికి భారత్‌లో స్టార్‌లింక్ భవిష్యత్తును నిర్ణయించేది మస్క్ వ్యాఖ్యలు మాత్రమే కాదు.. వినియోగదారులకు అందించే తుది ధరలు, సేవల నాణ్యత, స్థానిక మార్కెట్‌కు అనుగుణంగా రూపొందించే వ్యూహం. భారత టెలికాం రంగంలో ఇప్పటికే నెలకొన్న ధరల పోటీని దృష్టిలో పెట్టుకుంటే స్టార్‌లింక్‌కు సరసమైన ధరలే కీలక సవాలుగా మారనున్నాయి.
