స్టార్ బక్స్ కు ఏమైంది? వందల్లో స్టోర్లను మూసివేయటమా?
ఖరీదైన స్టార్ బక్స్ పానీయాలకు అమెరికాలో గిరాకీ తగ్గటంతో.. తగిన లాభాలు ఆర్జించని స్టోర్లను మూసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
By: Garuda Media | 27 Sept 2025 10:19 AM ISTఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా కాఫీ ప్రియులు ఏ దేశం వెళ్లినా.. అక్కడ దర్శనమిస్తే కాఫీ చైన్ లో ఫేమస్ స్టార్ బక్స్. కాఫీ అన్నంతనే గుర్తుకు వచ్చే ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధించి ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. వ్యయ నియంత్రణలో భాగంగా వందలాది స్టోర్లను మూసేస్తున్న వైనం సంచలనంగా మారింది.
ఖరీదైన స్టార్ బక్స్ పానీయాలకు అమెరికాలో గిరాకీ తగ్గటంతో.. తగిన లాభాలు ఆర్జించని స్టోర్లను మూసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో.. పెద్ద ఎత్తున సిబ్బంది పైనా వేటు పడుతున్న పరిస్థితి. మొత్తం అవుట్ లెట్లలో ఈ నెలలోనే ఒక శాతం వరకు మూత పడుతున్నట్లు చెబుతున్నారు. భారతదేశంలో స్టార్ బక్స్ టాటా గ్రూపుతో జత కట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
ఉత్తర అమెరికాలో జూన్ చివరకు 18,734 స్టోర్లు ఉంటే.. సెప్టెంబరు చివరకు ఇవి 18,300కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. మూసివేసే స్టోర్లకు సంబంధించి దాదాపు వెయ్యి వరకు ఉద్యోగుల మీద వేటు పడనుంది. భారత్ లో స్టార్ బక్స్ విస్తరణ అంతకంతకూ ఎక్కువ అవుతుంటే.. అందుకు భిన్నంగా అమెరికాలో మాత్రం సీన్ రివర్సులో ఉందని చెప్పాలి. ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారాన్ని పుంజుకునేలా చేసేందుకు బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ పథకానికి కంపెనీ ఓకే చేయటంతో.. ఇందులో భాగంగా వ్యయాలకు చెక్ పెట్టే విషయంలో సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది.
2012లో భారత్ లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తో కలిసి జాయింట్ వెంచర్ షురూ చేసింది.2024 జనవరికి దేశంలోని 54 నగరాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తోంది. ముంబయి.. న్యూఢిల్లీ.. హైదరాబాద్.. చెన్నై.. బెంగలూరు.. ఫుణె.. కోల్ కతా లాంటి అనేక ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఓపెన్ చేశారు. 2028 నాటికి దేశంలో వెయ్యి స్టోర్లకు విస్తరించాలన్న ప్రణాళికతో పని చేస్తోంది. భారత్ లో ఇలా దూసుకెళుతుంటే.. అమెరికాలో మాత్రం ఉన్న స్టోర్లను మూత వేసుకునే దుస్థితి.
