అమెరికాలో 250 ఔట్‌లెట్లు మూసేసి.. ఇండియా జేబు కొట్టేస్తున్న 'స్టార్‌బక్స్'!
అనవసర ఖర్చులను తగ్గించుకుంటూ గ్లోబల్ ఆపరేషన్స్‌ను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
By: Sivaji Kontham | 26 Sept 2026 5:00 PM ISTప్రపంచ ప్రఖ్యాత కాఫీ దిగ్గజం 'స్టార్‌బక్స్' అంతర్జాతీయంగా తన వ్యాపార వ్యూహాల్లో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియన్ నిక్కోల్ ఆధ్వర్యంలో కంపెనీ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు భారీ స్థాయి పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో రాబడిని ఇవ్వని సుమారు 250కి పైగా అవుట్‌లెట్లను మూసివేయడంతోపాటు.. నాన్-రిటైల్ విభాగంలో దాదాపు 900 ఉద్యోగాలను కోత విధించింది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటూ గ్లోబల్ ఆపరేషన్స్‌ను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
అయితే ఒకవైపు గ్లోబల్ మార్కెట్‌లో ఇలాంటి సంక్షేమ కోతలు, స్టోర్ల మూసివేతలు జరుగుతుండగానే... మరోవైపు భారత్‌లో మాత్రం స్టార్‌బక్స్ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగానే చెన్నై వేదికగా భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన విదేశీ మార్కెట్లలో భారాన్ని తగ్గించుకుంటూనే.. డిజిటల్ సామర్థ్యాలు.. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై పెట్టుబడులు పెట్టడమే ఈ కొత్త వ్యూహం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ గ్లోబల్ క్రైసిస్ ఎఫెక్ట్ హైదరాబాద్‌లోని స్టార్‌బక్స్ బ్రాంచీలపై ఏమాత్రం పడకపోగా.. నగరంలో దీని హవా మరింత పెరుగుతుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని స్టోర్లు మూతపడుతున్నా హైదరాబాద్‌లో మాత్రం స్టార్‌బక్స్ అత్యంత విజయవంతంగా దూసుకుపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో నగరంలో ప్రస్తుతం 30కి పైగా అవుట్‌లెట్లు దిగ్విజయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కేవలం మహానగరానికే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర టైర్-2 నగరాలకు కూడా దీని విస్తరణ క్రమంగా జోరందుకుంటోంది.
ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు తరచుగా సందర్శించే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో దక్షిణాది భారతదేశపు మొట్టమొదటి ప్రతిష్టాత్మక `స్టార్‌బక్స్ రిజర్వ్` కాఫీహౌస్ ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనం. సాధారణ కేఫ్‌లకు భిన్నంగా అత్యంత ప్రీమియం అనుభూతిని ఇస్తున్న ఈ లగ్జరీ హౌస్, కాఫీ ప్రియులకు ప్రధాన వేదికగా మారుతోంది.
మొత్తంగా విశ్లేషిస్తే.. స్టార్‌బక్స్ గ్లోబల్ స్థాయిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ తన వ్యాపార విధానాన్ని పునర్నిర్మించుకుంటున్నా.. హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం దీనికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇక్కడి అర్బన్ కల్చర్, యువత ఆదరణ.. వ్యాపార వృద్ధి అవకాశాలు స్టార్‌బక్స్‌కు తిరుగులేని డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి. గ్లోబల్ సంక్షోభాలకు భిన్నంగా హైదరాబాద్‌లో ఈ కాఫీ బ్రాండ్ తన సెలబ్రిటీ కళను కోల్పోకుండా, మరింత ఉన్నతమైన లగ్జరీ హంగులతో స్థిరమైన వృద్ధిని సాధిస్తోందని చెప్పవచ్చు.
