విజయ్ ని లైట్ తీసుకుంటే స్టాలిన్ ఫేట్ మార్చేశారు !
విజయ్ సినిమా హీరో. దళపతి అక్కడ. రాజకీయాల్లో ఇంకా వర్ధమాన నాయకుడు కూడా కాదు.
By: Satya P | 5 May 2026 6:00 AM ISTవిజయ్ సినిమా హీరో. దళపతి అక్కడ. రాజకీయాల్లో ఇంకా వర్ధమాన నాయకుడు కూడా కాదు. కుర్ర నేత. ఏమి తెలుసు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఢక్కామెక్కీలు తిని తల పండిన ఉద్ధండ రాజకీయ నేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకే అధినేత విజయ్ ని చాలా లైట్ తీసుకున్నారు. ఎంతలా అంటే అసలు విజయ్ పేరునే పలకడం అనవసరం అన్నంతలా. స్టాలిన్ ఈనాటి నాయకుడు కాదు. యాభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఎన్నో ఎన్నికల యుద్ధాలను చూసిన వారు. తండ్రి కరుణానిధి వెంట ఉంటూ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు పూర్తిగా అవగాహన చేసుకున్న వారు. అలాంటి స్టాలిన్ విజయ్ విషయంలో పొరపాటు చేశారా లేక అధికారం చేతిలో ఉంది కదా అని ఉదాశీనంగా వ్యవహరించారా అంటే తెలియదు కానీ దానికి భారీ మూల్యమే చెల్లించారు. ఏకంగా తన సీటులోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కం సీఎం గా ఉండగానే ఓటమి అందుకుని మాజీ సీఎంగానే కాదు మాజీ ఎమ్మెల్యేగానూ మారిపోయారు. ఇదంతా విజయ్ టీవీకే మహిమే అని అర్ధం అయ్యేసరికి డీఎంకే ఉదయించే సూర్యుడు పడమటకు వాలిపోవాల్సి వచ్చింది.
మోడీని టార్గెట్ :
తమిళనాడులో మోడీని డీఎంకే టార్గెట్ చేయడం తప్పుడు వ్యూహం. ఒక విధంగా అది నేల విడిచి చేసిన సాము గారడీ అయింది. బీజేపీకి పెద్దగా బలం లేని చోట స్టాలిన్ గాలిలో కత్తి పెట్టి యుద్ధం చేశారు. దాని వల్ల ఆయాసం తప్ప లాభం లేదని ఫలితాలు చెప్పాయి. ఇక అన్నా డీఎంకే మీద కూడా స్టాలిన్ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే ఆ పార్టీ కూడా అయిదేళ్ళ క్రితం అధికారం కోల్పోయి ఉంది. బడా లీడర్ల కొరతతో ఉంది ఒక వైపు విజయ్ గ్లామర్ తో ఉప్పెనలా దూసుకుని వస్తున్న నేపథ్యం ఉంటే కనీసం ఆ దిశగా కన్నెత్తి చూడలేదు, కనీసంగా ఆలోచించలేదు అంటే స్టాలిన్ విజయ్ ని ఎంత తక్కువగా అంచనా వేశారో అనిపిస్తుంది.
వ్యూహాలను కూడా :
విజయ్ కొత్త పార్టీ, సరిగ్గా నిర్మాణం లేదు అనుకున్నారు, కానీ ఆయన ఆలోచనలు ఆయన పార్టీ ఫిలాసఫీని జనంలోకి పంపిస్తున్న వైనం. వేలాదిగా ఉన్న విజయ్ ఫ్యాన్ క్లబ్బులు చేసే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఇవేమీ అధికారంలో ఉన్న స్టాలిన్ కి కనీసం ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పలేదా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక విజయ్ పట్ల జనంలో ఏ రకమైన అభిప్రాయం ఉంది. ఆయన ఇమేజ్ ఏ పార్టీని డ్యామేజ్ చేస్తోంది, ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది అన్నది రాజకీయ యుద్ధ క్షేత్రంలో నిలిచిన స్టాలిన్ పట్టించుకోలేదంటే ఆశ్చర్యమే కలుగుతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
రెండు పార్టీలే అని :
తమిళనాడులో ఆరు దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు రెండే కొనసాగుతున్నాయి. అయితే డీఎంకే లేకపోతే అన్నా డీఎంకే అన్నట్లుగానే అక్కడ సినారియో ఉంది. దానిని ఏ మాత్రం మార్చకూడదని స్టాలిన్ పట్టుబట్టినట్లున్నారు. పైగా కొత్త పార్టీని పట్టించుకుంటే హైప్ ఇచ్చినట్లు అవుతుందని భావించినట్లున్నారు. ఇలా డీఎంకే మీద అన్నా డీఎంకే. అలాగే వారి మీద వీరు విమర్శలు చేసుకుంటూ పొద్దు పుచ్చుకుంటే మధ్యలో వచ్చిన కొత్త పార్టీ టీవీకే అధికార పీఠం ఎంచక్కా ఎగరేసుకుని పోయింది. కొత్త పార్టీ అని అనుభవం లేని నాయకుడు అనుకున్నారే తప్ప చేతిలో కత్తికి పదును ఉంటుందని ఎత్తిన జెండా పైకే ఎగురుతుందని గుర్తించలేకపోవడమే స్టాలిన్ రాజకీయ వైఫల్యంగానే అంతా అంటున్నారు.
