Begin typing your search above and press return to search.

దళపతి సర్కార్‌ను కూల్చే వ్యూహం! స్టాలిన్ వర్సెస్ విజయ్.. ఎవరిది పైచేయి?

అయితే మాజీ సీఎం స్టాలిన్ హెచ్చరికలు, కొద్దికాలంగా ఆయన రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   29 Jun 2026 3:08 PM IST
దళపతి సర్కార్‌ను కూల్చే వ్యూహం! స్టాలిన్ వర్సెస్ విజయ్.. ఎవరిది పైచేయి?
X

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాజకీయ జీవితం అంత సాఫీగా సాగదా? ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేస్తున్న హెచ్చరికలు ఏ సంకేతం ఇస్తున్నాయి. ఐదేళ్లపాటు కొనసాగాల్సిన విజయ్ సర్కార్ ఆరు నెలల ముచ్చటగానే మిగులుతుందని డీఎంకే అధినేత స్టాలిన్ పదే పదే ఎందుకు చెబుతున్నారు? ఇంతకీ తమిళనాడులో ఏం జరుగుతుంది. ఎన్నికలు ముగిసిన రెండు నెలల తర్వాత కూడా రాజకీయ వేడి తగ్గకపోవడానికి కారణమేంటన్నదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజంగా తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై అసంతృప్తి ఉందా? లేక అధికారం కోల్పోయిన డీఎంకే అధినేత స్టాలిన్ ప్రతిపక్షంలో కూర్చోలేకపోతున్నారా? తమ కూటమిలోని పార్టీలతో వ్యూహాత్మకంగా మద్దతు ఇప్పించి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన మార్గం ఏర్పరిచిన స్టాలిన్ ఎందుకని ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారు? ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విజయ్ ఏం చేయనున్నారు. సీఎం విజయ్ రాజకీయ వ్యూహం ఏంటి? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

తమిళనాడులో ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం అస్థిరంగా ఉందని, ఏ సమయంలో అయినా కూలిపోవచ్చని స్టాలిన్ హెచ్చరికలు బింగ్ సౌండ్ చేస్తున్నాయి. సీనియర్ నేతగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న స్టాలిన్ ఏదో గట్టి ఆలోచనతోనే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ కూటమి పార్టీల దయతోనే విజయ్ ప్రభుత్వం నడుస్తోందని స్టాలిన్ చెబుతున్నారు. తాను కనుసైగ చేస్తే విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వీసీకే, కమ్యూనిస్టులు వెనక్కి వచ్చేస్తారని, ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుందని స్టాలిన్ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ కారణంగానే విజయ్ సర్కార్ ఆరు నెలల ముచ్చట అంటూ డీఎంకే ప్రచారం చేస్తోంది.

గత ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కేవలం 107 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. 234 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది సభ్యుల బలం అవసరం. అయితే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా, అవసరమైన మెజార్టీ లేక టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తర్జనభర్జన కొనసాగింది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకూడదనే ఆలోచనతోపాటు విజయ్ సమర్థతను పరీక్షించాలనే వ్యూహాత్మక ఆలోచనతో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తమ కూటమిలోని వీసీకే, కమ్యూనిస్టు పార్టీలను టీవీకేకు మద్దతు ఇవ్వాల్సిందిగా సూచించారని అంటున్నారు. ఇదే సమయంలో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతంగా టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అంటున్నారు. కానీ, అధికారం చేతికి వచ్చాక ముఖ్యమంత్రి విజయ్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న మాజీ సీఎం స్టాలిన్ తమ కూటమిలోని పార్టీలను ఉసిగొల్పి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేలా ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. దీంతోనే కొద్దినెలల్లో.. మరీ క్లియర్ గా చెప్పాలంటే ఆరు నెలల్లోనే విజయ్ ప్రభుత్వం పడిపోతుందని స్టాలిన్ హెచ్చరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే మాజీ సీఎం స్టాలిన్ హెచ్చరికలు, కొద్దికాలంగా ఆయన రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు. డీఎంకే కూటమిలోని పార్టీలతో ఎప్పటికైనా తనకు ముప్పుగా భావించిన సీఎం విజయ్ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ ముందస్తు వ్యూమాల్లో భాగంగానే ఏఐడీఎంకే నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో ఆరు చోట్ల టీవీకే ఎమ్మెల్యేలను గెలిపించుకుని మిత్రపక్షాలపై ఆధారపడకుండా ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని అంటున్నారు. అయితే ఈ ఆరు ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా విజయ్ సర్కార్ ని మైనార్టీలో పడేయాలని మాజీ సీఎం స్టాలిన్ వ్యూహంగా అనుమానిస్తున్నారు. దీంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా మాజీ సీఎం స్టాలిన్ హెచ్చరికలు చేస్తున్నారని అంటున్నారు. గత ప్రభుత్వంపై విజయ్ దాడి ఉధృతం అవుతున్న కొద్ది ఈ రాజకీయ వ్యూహం మరింత వేడెక్కించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి తమిళనాడులో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వరకు ఈ రాజకీయ క్రీడ కొనసాగుతుందని చెబుతున్నారు.