Begin typing your search above and press return to search.

సిట్టింగుల‌కే 90 శాతం సీట్లు.. స్టాలిన్ 'విజ‌య' వ్యూహం!

సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌డాన్ని అధికార పార్టీలు దాదాపు నిరాకరిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

By:  Garuda Media   |   29 March 2026 1:00 PM IST
సిట్టింగుల‌కే 90 శాతం సీట్లు.. స్టాలిన్ విజ‌య వ్యూహం!
X

సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌డాన్ని అధికార పార్టీలు దాదాపు నిరాకరిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వారిపై అవినీతి మ‌ర‌క‌లు ప‌డ డం కానీ.. లేదా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేర‌న్న వాద‌న కానీ.. ఇలా అనేక కార‌ణాల‌తో సిట్టింగు ఎమ్మెల్యేల‌కు టికెట్లు నిరాక‌రి స్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలైతే మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. గ‌తంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌.. త‌న పార్టీకి చెందిన వారిలో స‌గం మందికి టికెట్లు నిరాక‌రించారు. త‌ద్వారా.. వారి స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించి.. విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. కానీ..ఈ వ్యూహం బెడిసి కొట్టింది.

పోనీ.. సిట్టింగుల‌కే అవ‌కాశం ఇచ్చిన తెలంగాణ‌లోనూ కేసీఆర్ ఇదే దెబ్బ‌తిన్నారు. సిట్టింగు ఎమ్మెల్యేల‌ను మార్చాల‌ని వ‌చ్చిన అనేక సిఫార‌సుల‌ను అప్ప‌ట్లో కేసీఆర్ తోసిపుచ్చారు. అంతేకాదు.. సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌డాన్ని స‌మ‌ర్థించారు. ఇది.. కూడా బెడిసి కొట్టింది. ఇక‌, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో త‌మిళ‌నాడు ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇక్క‌డి అధికార డీఎంకే పార్టీ అధినేత‌, సీఎం స్టాలిన్‌.. త‌న పార్టీకి చెందిన వారిలో దాదాపు 90 శాతం మంది సిట్టింగుల‌కు టికెట్లు ఖ‌రారు చేశారు. కేవ‌లం పొత్తులో భాగంగా ఒక‌టి రెండు సీట్ల‌లో మాత్ర‌మే మార్పులు చేశారు.

వ్యూహం ఏంటి?

ఈ విష‌యంపై స్టాలిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సిట్టింగు ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వ‌డాన్ని ఆయ‌న స‌మ‌ర్థించుకున్నారు. అంతేకాదు.. వారికి అనుభ‌వం ఉంద‌ని.. ఇప్పుడు ఉన్న పోటీనిఎదుర్కొనేందుకు.. త‌మ‌ను తాము నిరూపించుకునేందుకు ఇదే స‌రైన అవ‌కాశ‌మ‌ని వారు భావిస్తున్నార‌ని.. అందుకే సిట్టింగుల‌కు టికెట్లు ఇచ్చేశామ‌న్నారు. అయితే..ఆశావ‌హుల‌కు ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీకి సుమారు 42 కోట్ల రూపాయ‌లు ఇంట‌ర్వ్యూ ఫీజు కింద జ‌మైంది. మ‌రి వారి సంగ‌తి ఏంటంటే.. స్థానికంగా వారికి ప్రాధాన్యం కల్పిస్తామ‌న్నారు.

చ‌తుర్ముఖ పోటీ..

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో చ‌తుర్ముఖ పోటీ క‌నిపిస్తోంది. 1) డీఎంకే+కాంగ్రెస్ కూట‌మి. 2) బీజేపీ+అన్నాడీఎంకే కూట‌మి. 3) ఎన్‌పీకే+క‌మ్యూనిస్టులు. 4) టీవీకే(ద‌ళ‌ప‌తి విజ‌య్ పార్టీ) ఒంట‌రి పోరు. ఇలా.. మూడు నుంచి నాలుగు పార్టీల మ‌ధ్య ఈ సారి త‌మిళ‌నాడులో భారీ పోటీ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్లు.. అనుభ‌వం ఉన్న‌వారు.. ఆల్రెడీ సిట్టింగుల‌కు టికెట్లు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌ల ఆమోదం పొంద‌వ‌చ్చ‌ని స్టాలిన్ భావిస్తున్నారు. ఇత‌ర పార్టీల‌లో కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాట ప్ర‌జ‌లు అనుభ‌వానికి పెద్ద‌పీట వేస్తార‌ని ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్నారు. మ‌రి ఆయ‌న వ్యూహం ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటుందో చూడాలి.