Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి కుంపటి.... స్టాలిన్ మూడవ ఫ్రంట్ ?

కాంగ్రెస్ పార్టీ అంటే డీఎంకే అధినేత స్టాలిన్ మండిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తమిళనాడుకు ఎన్నికలు జరిగాయి.

By:  Satya P   |   15 Sept 2026 9:48 AM IST
కాంగ్రెస్ కి కుంపటి....   స్టాలిన్  మూడవ ఫ్రంట్ ?
X

కాంగ్రెస్ పార్టీ అంటే డీఎంకే అధినేత స్టాలిన్ మండిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తమిళనాడుకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల వేళ డీఎంకే సారధ్యంలో కాంగ్రెస్ సహా అంతా ఒక కూటమిగా ఉంటూ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో డీఎంకే రెండవ స్థానానికి పడిపోయింది. విజయ్ నాయకత్వంలోని టీవీకే 108 సీట్లతో పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ సమయంలో డీఎంకేతో పాతికేళ్ళ చెలిమిని కూడా పక్కన పెట్టేసి కాంగ్రెస్ టీవీకే విజయ్ కి మద్దతు ఇచ్చింది. దాంతో డీఎంకే రగిలిపోయింది. తమకు ఇండియా కూటమితో సంబంధం లేదని కూడా చెప్పేసింది. నాటి నుంచి కాంగ్రెస్ మీద కారాలు మిరియాలూ నూరుతూనే ఉంది. ఇపుడు అయితే కాంగ్రెస్ కింద కుంపటి పెట్టే పనిలో స్టాలిన్ ఫుల్ బిజీ అయిపోయారు.

ప్రాంతీయ పార్టీలతోనే :

దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవి కొన్ని ఎన్డీయే కూటమిలో ఉంటే కొన్ని ఇండియా కూటమిలో ఉన్నాయి. మరి కొన్ని తటస్థంగా ఉన్నాయి. దాంతో ఇపుడు డీఎంకేకి కొత్త ఆలోచనలు పుడుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ కంటే కూడా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా అని సరి కొత్త వ్యూహాలకు దిగుతోంది. ప్రాంతీయ పార్టీలను వీలైనంత వరకూ ఏకం చేసే పనిలో డీఎంకే ఇప్పుడు ఉంది అని అంటున్నారు. ముందుగా ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలతోనే మొదలెట్టింది. స్టాలిన్ అప్పగించిన ఈ పనిని డీఎంకే డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సమర్ధంగా నిర్వహిస్తున్నారు.

వరస భేటీలతో :

ఇక కనిమొళి వరస భేటీలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో వేస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ తో విభేదాలు ఉన్న పార్టీలను ఏకత్రాటిపైకి తీసుకుని రావడమే ఈ భేటీ ఉద్దేశ్యం అని అంటున్నారు. ఇక ముంబైకి వెళ్ళిన కనిమొళి అక్కడ శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. బాంద్రాలోని మాతోశ్రీ నివాసంలో జరిగిన ఈ కీలక సమావేశం అయితే ఏకంగా గంటపాటు సాగిందని అంటున్నారు. దాని కంటే ముందు ఉద్ధవ్‌ ఠాక్రే స్వయంగా కనిమొళికి స్వాగతం పలకడం విశేషం. ఈ సందర్భంగా లోక్ సభ సీట్ల విషయంలో కేంద్రం తీసుకుని వస్తున్న పునర్విభజన బిల్లు దాని మీద కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరి ఇండియా కూటమి భవిష్యత్‌ కార్యాచరణపై వంటి వాటి మీద చర్చ సాగింది అని చెబుతున్నారు. ఇక పునర్విభజన బిల్లు అమలు అయితే దక్షిణాది రాష్ట్రాలపై నియోజకవర్గాల దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. అలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కలసి ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా చర్చించారని తెలుస్తోంది.

శరద్ పవార్ తో సైతం :

ఇక కనిమిళి ఢిల్లీ వెళ్లి ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్‌ పవార్‌ తో కూడా సమావేశం కావడం విశేషం. అదే విధంగా త్వరలో పంజాబ్‌ సీఎం, ఆప్‌ నేత ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తోనూ ఆమె భేటీ కానున్నట్లుగా చెబుతున్నారు. ఈ భేటీల ముఖ్య ఉద్దేశ్యం దీర్ఘ కాలమైనది అని అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలను పక్కన పెట్టి మూడవ ఫ్రంట్ కి తెర లేపాలన్నది డీఎంకే ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దానికి గానూ కలసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశాలు ఉంటాయని అంటున్నారు. రానున్న కాలంలో తటస్థ పార్టీలతో పాటు ఎన్డీయేలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కూడా భేటీలు ఉండొచ్చు అని చెబుతున్నారు.