Begin typing your search above and press return to search.

100 కోట్ల డ్రగ్స్ కేసు...విజయ్ ని టార్గెట్ చేసిన స్టాలిన్

తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని గురి పెట్టి ఉంచింది ప్రతిపక్షం. డీఎంకే అయితే మొదటి రోజు నుంచి కాచుకుని కూర్చుంది.

By:  Satya P   |   18 Oct 2026 8:03 AM IST
100 కోట్ల డ్రగ్స్  కేసు...విజయ్ ని టార్గెట్ చేసిన స్టాలిన్
X

తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని గురి పెట్టి ఉంచింది ప్రతిపక్షం. డీఎంకే అయితే మొదటి రోజు నుంచి కాచుకుని కూర్చుంది. అలాంటిది ఒక పెద్ద డ్రగ్స్ కేసు అందులో టీవీకే నేత ప్రమేయం ఉందన్న వార్తలు గుప్పుమంటే మాజీ సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ అసలు ఊరుకుంటారా. అందుకే ముఖ్యమంత్రి విజయ్ ని గట్టిగానే టార్గెట్ చేశారు. చాలా పెద్ద మాటలే వాడేస్తూ ట్వీట్ చేశారు. టీవీకే అంటే ఒక బ్యాడ్ పార్టీ మాత్రమే కాదు, అదొక బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ అంటే డ్రగ్స్ తయారు చేసి అమ్మే ముఠా అన్న అర్ధం వచ్చేలా ప్రసిద్ధ వెబ్ సిరీస్ పేరును ప్రస్తావిస్తూ ఎక్స్ లో స్టాలిన్ చేసిన ట్వీట్ అయితే ఇపుడు వైరల్ అవుతోంది.

డ్రగ్స్ సంచలనం :

సడెన్ గా ఈ డ్రగ్స్ కేసు ఏమిటి అంటే ఏకంగా 100 కోట్ల రూపాయల విలువైన 135 కిలోల మెతాంపేటమైన్ డ్రగ్స్ పట్టుబడింది. నాగపట్నం జిల్లాకు చెందిన టీవీకే పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కీజ్వేలూరు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన వ్యక్తి ఇంట్లో కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదా చేసి భారీ డ్రగ్స్ నిల్వలను పట్టుకున్నారు.ఈ డ్రగ్స్‌ను శ్రీలంకకు స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారంగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి అధికార పార్టీకి చెందిన నాయకుడు, భారీగా డ్రగ్స్ ఆయన ఇంట్లోనే దొరకడం దానిని ఇతర దేశానికి అక్రమ రవాణాకు ప్రణాళిక రచించడం చూస్తే ఇది భారీ స్కాం అనే అంటోంది డీఎంకే. అందుకే స్టాలిన్ ఏ మాత్రం లేట్ చేయకుండా విజయ్ ప్రభుత్వం మీద గట్టిగా విరుచుకుపడ్డారు.

మీటింగుల్లో చెప్పేదొకటి :

ముఖ్యమంత్రి విజయ్ డ్రగ్స్ నిర్మూలన అంటూ ప్రజలకు బహిరంగ వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ నీతులు చెబుతున్నారని కానీ ఆయన సొంత పార్టీ నాయకులే ఈ విధంగా వందల కోట్ల డ్రగ్స్ నెట్ వర్క్ ని నడుపుతున్నారని స్టాలిన్ ఫైర్ అయ్యారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో అడ్డంగా దొరికిపోయారని కూడా ఆయన విమర్శించారు. విజయ్ సినిమాలలో పంచ్ డైలాగులు కొడితే చాలదని డ్రగ్స్ కుంభకోణం వెనకాల ఎవరు ఉన్నారో మొత్తం సమగ్రమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇది మామూలు కేసుగా లైట్ తీసుకోరాదని హెచ్చరించారు. టీవీక పార్టీలో ఎంత మంది లియో దాసులు ఉన్నారో అని కూడా స్టాలిన్ ఎద్దేవా చేశారు. లియో దాస్ అంటే విజయ్ నటించిన లియో చిత్రంలోని గ్యాంగ్‌స్టర్ పాత్ర అన్న మాట. దానిని గుర్తు చేస్తూ స్టాలిన్ విజయ్ కి గట్టిగానే కౌంటర్ వేశారు అని అంటున్నారు.

సీరియస్ గా టీవీకే :

అయితే వంద కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టుబడడంతో టీవీకే సీరియస్ గానే స్పందించింది. తమిళనాడు మొత్తం ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో టీవీకే పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు భూపాలన్‌ను టీవీకే పార్టీ నుండి తక్షణమే బహిష్కరిస్తూ అధినేత హోదాలో విజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే విజయ్ తమిళనాడులో గత అయిదు నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలకు అమలు చేయాలని ఆలోచిస్తున్న వేళ పార్టీలో కొంత మంది వల్ల చెడ్డ పేరు వస్తోంది అని అంటున్నారు. దిగువ స్థాయిలో కొందరు నాయకులు చేసే అక్రమ కార్యకలాపాలతో పార్టీ ఇమేజ్ దెబ్బ తింటోంది అని అంటున్నారు. అది విపక్షానికి ఆయుధంగా మారుతోంది అని కూడా అంటున్నారు.