Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అంటే వెన్నుపోటు... తేల్చేసిన స్టాలిన్

కాంగ్రెస్ ని వెన్నుపోటుదారునిగా పేర్కొన్న స్టాలిన్ మరిన్ని మాటలను కూడా జత చేశారు. ఆ పార్టీది ద్వంద్వ వైఖరని తీవ్రంగా విమర్శించారు. అందుకే దూరం పెట్టామని అన్నారు.

By:  Satya P   |   18 Oct 2026 9:07 AM IST
కాంగ్రెస్ అంటే వెన్నుపోటు... తేల్చేసిన స్టాలిన్
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ బాధ ఇపుడు కాంగ్రెస్ మీద కోపంగా శాపంగా మారుతోంది. తనను ఏకంగా వెన్నుపోటు పొడిచారు అని ఈ దిగ్గజ నాయకుడు తీవ్రంగా వ్యధ చెందుతున్నారు. కాంగ్రెస్ తో చెలిమి దశాబ్దాల పాటు సాగింది, కానీ విడిపోవడం అంటే ఈ విధంగానా అని కలత చెందుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయమంటే చేయమని ఒట్టేసి మరీ చెబుతున్నారు.

హస్తంతో దూరమే :

కాంగ్రెస్ పార్టీకి ఇక ఎప్పటికీ దూరమే అని స్టాలిన్ బిగ్ స్టేట్మెంట్ నే ఇచ్చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల డీఎంకే ఇప్పటికీ ఆగ్రహంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖద్దర్ పార్టీని క్షమించేది లేదని అంటోంది. అందుకే కాంగ్రెస్ ని దూరం పెట్టామని డీఎంకే చెబుతోంది. ఇక తమ పార్టీ కాంగ్రెస్ తో దోస్తీ కంటే ప్రత్యర్థిగానే చూస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన పదే పదే స్పష్టం చేస్తున్నారు.

మండుతున్న డీఎంకే :

కాంగ్రెస్ ని వెన్నుపోటుదారునిగా పేర్కొన్న స్టాలిన్ మరిన్ని మాటలను కూడా జత చేశారు. ఆ పార్టీది ద్వంద్వ వైఖరని తీవ్రంగా విమర్శించారు. అందుకే దూరం పెట్టామని అన్నారు. సర్ ప్రక్రియ తప్పుడు విధానం మీద కానీ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ విషయంలో కానీ సీజేపీ చేపడుతున్న ఆందోళనల విషయంలో కానీ డీఎంకే క్లారిటీతో ఉందని, ఆందోళనలకు మద్దతు ఇస్తుందని కూడా డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పారు. అంతే కాదు సర్ ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలో ఇక మీదట జరిగే ఎన్నికలలో బ్యాలెట్ విధానం తేవాలని కోరారు. అలాగే సీఈసీని తొలగించాలని డీఎంకే తీర్మానించింది. ఈ మేరకు స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డీఎంకే పార్టీమీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూట్రల్ స్టాండ్ తోనేనా :

డీఎంకే కాంగ్రెస్ కి దూరం అని ప్రకటించింది. మరి ఎన్డీయేకు చేరువ అంటే కానే కాదు అని అంటున్నారు. సర్ ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. న్యూట్రల్ స్టాండ్ తో జాతీయ రాజకీయాల్లో తన పలుకుబడిని పెంచుకోవాలని డీఎంకే చూస్తోంది అని అంటున్నారు. 2029 ఎన్నికల్లో ఏ పార్టీకి కానీ కూటమికి కానీఎ పూర్తి మెజారిటీ రాదని డీఎంకే భావిస్తోంది. అపుడు తమ పాత్ర కీలకం అవుతుందని కూడా అంచనా వేస్తోంది. అందుకే రానున్న రెండున్నరేళ్లూ తమిళనాడులో తమ రాజకీయ బలం పెంచుకుంటే అపుడు అందరూ తమ వైపే చూస్తారన్న వ్యూహంతో డీఎంకే ఉందని అంటున్నారు.