Begin typing your search above and press return to search.

ఈ కీటకం ఖరీదు సుమారు కోటి రూపాయలు.. స్పెషాలిటీ ఇదే!

కీటకం ఏమిటి.. దాదాపు కోటి రూపాయల విలువ ఉండటం ఏమిటి అనే సందేహం రావడం సహజం.

By:  Raja Ch   |   5 Oct 2025 10:20 AM IST
ఈ కీటకం ఖరీదు సుమారు కోటి రూపాయలు.. స్పెషాలిటీ ఇదే!
X

కీటకం ఏమిటి.. దాదాపు కోటి రూపాయల విలువ ఉండటం ఏమిటి అనే సందేహం రావడం సహజం. కానీ.. ఇది అక్షరాలా నిజం! ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అరుదైన, మరికొంతమందికి అదృష్టంగా భావించే ఓ కీటకం ధర ప్రపంచ మార్కెట్ లో రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకూ పలుగుతుందని చెబుతున్నారు. దాని పేరే స్టాగ్ బీటిల్!

అవును... గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం స్టాగ్ బీటిల్. దీని ధర మార్కెట్ లో రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకూ పలుకుతుంది. ఈ స్టాగ్ బీటిల్ అత్యంత అరుదైనది కావడంతో పాటు చాలామంది దీన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మరికొంతమంది తమకు ఆకస్మిక సంపదను తెస్తుందని నమ్ముతారు.

సుమారు 3 అంగుళాల పొడవున్న ఈ స్టాగ్ బీటిల్.. ఆగస్టు 19, 1999న టోక్యోలోని ఒక దుకాణంలో 10,035,000 జపనీస్ యెన్ (సుమారు రూ.79,22,925) కు అమ్ముడైంది! ఇవి సాధారణంగా పాత ఓక్ చెట్ల బొరియలలో నివసిస్తాయి. పగటిపూట చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి.. అందువల్ల వాటిని కనుగొనడం చాలా కష్టమనీ చెబుతారు.

లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం.. వయోజన స్టాగ్ బీటిల్స్ సాధారణంగా 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. పరిమాణం పరంగా.. మగ బీటిల్స్ సాధారణంగా 35 నుండి 75 మిమీ పొడవు ఉండగా.. ఆడ స్టాగ్ బీటిల్స్ కాస్త చిన్నగా 30 నుండి 50 మిమీ వరకు ఉంటాయి. వాటి జీవితకాలం చాలా సంవత్సరాలు ఉంటుంది.

కాగా... గత ఏడాది ఆగస్టు నెలలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ కీటకం ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కోనాం గ్రామానికి చెందిన గేమ్మెలి చంటి అనే గిరిజనుడు అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు చూడటానికి వింతగా ఉన్న ఓ అరుదైన కీటకం కనిపించింది.

దీంతో... దాన్ని ఆకులో చుట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయం పలువురికి తెలియడంతో ఆ కీటకాన్ని చూసేందుకు చాలామంది వచ్చారు. ఈ సమయంలో దాన్ని స్టాగ్ బీటిల్ గా గుర్తించారు.

ఇక ఇతర కీటకాల మాదిరిగానే ఈ స్టాగ్ బీటిల్ కూడా కాలినడక, రెక్కల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ కీటకాలు ఆహార వనరులకు సమీపంలోనే గుడ్లు పెట్టే చోటు వెతుక్కుని ఉంటాయి. ఇవి ఎక్కువగా భారతదేశంలోని అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఆగ్నేసియాలోని దట్టమైన ఉష్ణమండల అడవుల్లో ఉంటాయని చెబుతుంటారు. ఇక ఈ స్టాగ్ బీటిల్స్ లో మగవాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంటుంటారు.