Begin typing your search above and press return to search.

మేయర్ జడ్పీ రెండూ జనసేనకేనా ?

ఉత్తరాంధ్రాలో తన రాజకీయ బలాన్ని చాటుకోవాలని జనసేన పార్టీ చూస్తోంది.

By:  Satya P   |   26 Oct 2026 9:22 AM IST
మేయర్ జడ్పీ రెండూ జనసేనకేనా ?
X

ఉత్తరాంధ్రాలో తన రాజకీయ బలాన్ని చాటుకోవాలని జనసేన పార్టీ చూస్తోంది. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల తరువాత రాజకీయంగా ఎదిగేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్రా అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ. మెజారిటీ నియోజకవర్గాలలో వారి ప్రభావం అధికంగా ఉంటుంది. దాంతో జనసేన 2024 ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్రాలోని మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో ఆరు సీట్లు పొత్తులో భాగంగా తీసుకుని ఆరుకు ఆరూ గెలిచింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తే ఉత్తరాంధ్రాలో విజయనగరం మేయర్ సీటుని ఆ పార్టీ ఆశించింది అని ప్రచారం లో ఉంది. అయితే అక్కడ టీడీపీ పోటీ చేస్తోంది. దాంతో శ్రీకాకుళం మేయర్ సీటు కేటాయించారు. ఇపుడు జడ్పీ పీఠాలలో కూడా తమకు న్యాయమైన వాటాను జనసేన కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి.

అక్కడ నుంచేనా :

అయితే శ్రీకాకుళం జెడ్పీ పీఠం కూడా జనసేనకు కేటాయిస్తున్నారు అన్న ప్రచారం ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. నామినేషన్ల స్క్రూటినీ కూడా పూర్తి అయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ కంటే ముందు బీ ఫారాలు తమ పార్టీ నేతలకు ఇవ్వాలని కూటమిలోని మూడు పార్టీలు చూస్తున్నారు. ఏపీలో మొత్తం 28 జెడ్పీ చైర్మన్ పదవులు ఉన్నాయి. అందులో ఎవరికి ఎన్ని అన్న దాని మీద చంద్రబాబు పవన్ పీవీఎన్ మాధవ్ చర్చిస్తున్నారు అని అంటున్నారు. అయితే జనసేన ఆరు జెడ్పీ చైర్మన్ సీట్లు పట్టుబడుతోంది అని అంటున్నారు. అందులో ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం ఒకటి అని అంటున్నారు. దాంతో అదే కనుక జరిగితే మేయర్ తో పాటు జెడ్పీ పీఠం కూడా జనసేనకే దక్కుతోంది అని అంటున్నారు.

సుడా చైర్మన్ సతీమణికి :

జెడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయిస్తారు అన్న ఊహాగానాల మధ్య సుడా చైర్మన్ అయిన కొరికాన రవికుమార్ సతీమణి కొరికాన భవానీ చేత ఎల్ ఎస్ పేట జెడ్పీటీసీగా నామినేషన్ హడావుడిగా వేయించారు అని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు జిల్లాలో నాలుగు జెడ్పీటీసీలు జనసేనకు కేటాయించారు. అయితే ఈ పదవి విషయంలో టీడీపీలో కూడా పోటీ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఆముదాలవలస నుంచి మెట్ట సుజాత జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు.

టీడీపీలో చర్చ :

అయితే జడ్పీ చైర్మన్ పదవి కనుక జనసేనకు కేటాయిస్తే డిసెంబర్ లో జరిగే మేయర్ పదవిని టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ కోరుతోంది. రెండు కీలక పదవులూ పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులకు ఏమి ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు. పైగా రెండు పదవులు మహిళలకు రిజర్వ్ కావడంతో చాలా మంది సీనియర్లు పోటీ చేయలేకపోయారు అని అంటున్నారు. తమ వారసులకు అయినా పదవులు దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు. జనసేనకు ఉత్తరాంధ్రాలో రెండు జెడ్పీలు ఇస్తారని అందులో ఒకటి శ్రీకాకుళం, రెండవది అల్లూరి జిల్లా అని చెబుతున్నారు. మొత్తం ఆరు జెడ్పీలు ఉంటే ఇందులో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి టీడీపీ పోటీ చేస్తుందని చెబుతున్నారు. దాంతో శ్రీకాకుళం జెడ్పీ జనసేనకు ఖరారు అయినట్లే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.