సిక్కోలు సిత్రం : కూటమికే సర్వం సమర్పయామీ !
వైసీపీలో వర్గ పోరు టాప్ రేంజిలో ఉన్నది ఉత్తరాంధ్రాలో ఏ జిల్లా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అని ఠక్కున జవాబు వస్తుంది.
By: Satya P | 13 Sept 2026 9:45 AM ISTవైసీపీలో వర్గ పోరు టాప్ రేంజిలో ఉన్నది ఉత్తరాంధ్రాలో ఏ జిల్లా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అని ఠక్కున జవాబు వస్తుంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. దిగ్గజ నేతలు ఉన్నారు. కానీ ఏమి లాభం అని కార్యకర్తలు వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. ఏ నియోజకవర్గం చూసినా మూడు గ్రూపులుగా ఆరు వర్గాలుగా విడిపోయి సొంత పార్టీలోనే పీకి పందిరి వేస్తున్నారని అంటున్నారు. జిల్లా అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణ దాస్ మెత్తగా ఉండడం కూడా వీటికి ఆజ్యం పోస్తోంది. ఇక అధినాయకత్వం కూడా వర్గ పోరు విషయంలో ఏమీ చేయలేక అలాగే వదిలేసింది అని అంటున్నారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు తోసుకొస్తున్న వేళ వైసీపీలో వర్గ పోరు హెచ్చుతోంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు అని అంటున్నారు.
జిల్లా పీఠంతో పాటుగా :
శ్రీకాకుళం జిల్లా పరిషత్తుతో పాటు తొలిసారిగా నగర కార్పోరేషన్ కి, అదే విధంగా మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే వందలాది సర్పంచులకు ఎన్నికలు జరుగుతాయి. మరి వైసీపీ అంతా ఒక్కటిగా కలసి పోరాడక పోతే బలమైన టీడీపీ కూటమిని ఎలా ఢీ కొడుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 11 అధికారికంగా ప్రచురించారు. ప్రస్తుతం ఉన్న మండల పరిషత్‌ల పదవీకాలం సెప్టెంబర్ 2 తో అలాగే జిల్లా పరిషత్‌ల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనుంది. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
మొదట మునిసిపాలిటీలలోనే :
ఇక పట్టణ ప్రాంతాలతో పాటు మున్సిపల్ ఎన్నికలు తొలి విడతలో జరగనున్నాయి. దాంతో గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, కాశీబుగ్గ, ఆమదాలవలస, రాజాం వంటి మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలు నిర్వహించేందుకు వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. దాంతో శ్రీకాకుళంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ఊటమి పక్షాన తెలుగుదేశం జనసేన బీజేపీతో పాటు వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నా వైసీపీలో మొత్తం ఉమ్మడి పది అసెంబ్లీ సీట్లను చూసుకుంటే మెజారిటీ సీట్లలో వర్గ పోరు హెచ్చుగా ఉంది అని అంటున్నారు. ఇచ్చాపురంలో మొదలెడితే అక్కడ కొత్త ఇంచాజి శ్యాం ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ కి అసలు పడడం లేదు, దాంతో మూడు ముక్కలాటగా సాగుతోంది. పలాసాలో మాజీ మంత్రి సీదరి అప్పలరాజుకు పలాస మాజీ మునిసిపల్ చైర్మన్ గిరిబాబుల మధ్య మాటలు కూడా కనీసం లేవని అంటున్నారు. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచారి పేరాడ తిలక్ కి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయనకు సహకరించేందుకు మిగిలిన వర్గాలు సిద్ధంగా లేవు అని అంటున్నారు.
ముదిరిన వర్గ పోరు :
అలాగే ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినెని సీతారాం వర్గానికి ఇంచార్జి చింతాడ రవికుమార్ వర్గానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజాం లో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులుకు అలాగే ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న డాక్టర్ తలే రాజేష్ వర్గాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఎచ్చెర్లలో వైసీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గొర్లె రవి కుమార్ కి వ్యతిరేకంగా సొంత బావమరిది సాయి కుమార్ వేరు వర్గాన్ని నడిపిస్తున్నారు. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మరో కీలా నేత మామిడి శ్రీకాంత్ కి అసలు పడడం లేదు అని అంటున్నారు. ఇలా చూస్తే ధర్మాన బ్రదర్స్ సొంత నియోజకవర్గాలు అయిన నరసన్నపేట, శ్రీకాకుళం తప్పించి అన్ని చోట్ల వైసీపీ కధ ఇలాగే ఉంది. మరి సొంత పార్టీలోనే కత్తులు దూసుకుంటే కూటమిని ఎలా గెలుస్తారు అని కార్యకర్తల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే తీరున ఉంటే మరోసారి కూటమికే సర్వం సమర్పయామీ అన్నట్లుగానే సిక్కోలు సీన్ ఉందని అంటున్నారు.
