Begin typing your search above and press return to search.

వైసీపీలో తమ్మినేని మార్క్ పొలిటికల్ బాంబు !

విజయనగరం జిల్లా వైసీపీలో చిన్న శ్రీను సృష్టించిన రాజకీయ కలకలం ఇంకా చల్లారలేదు, ఇంతలో సిక్కోలు నుంచి కూడా వైసీపీకి సంబంధించి సెగలూ పొగలూ పెద్ద ఎత్తున రాజుకుంటున్నాయి.

By:  Satya P   |   16 Sept 2026 9:20 AM IST
వైసీపీలో తమ్మినేని మార్క్ పొలిటికల్ బాంబు !
X

విజయనగరం జిల్లా వైసీపీలో చిన్న శ్రీను సృష్టించిన రాజకీయ కలకలం ఇంకా చల్లారలేదు, ఇంతలో సిక్కోలు నుంచి కూడా వైసీపీకి సంబంధించి సెగలూ పొగలూ పెద్ద ఎత్తున రాజుకుంటున్నాయి. ఎంతో కాలంగా గుట్టుగానో లేక పరోక్షంగానూ ఉన్న విభేదాలు కాస్తా స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమాని రట్టు అవుతున్నాయి. ధర్మాన బ్రదర్స్ వర్సెస్ తమ్మినేనిగా జిల్లా రాజకీయ మంట రాజుకుంది. తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ధర్మాన సోదరుల మీద చేసిన ఘాటు విమర్శలతో జిల్లా వైసీపీ రాజకీయం హీటెక్కిపోతోంది. అసలే టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలో వైసీపీలో ఇదేమి కొత్త పోరు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

పార్టీలో ఉన్నట్లా లేనట్లా :

ఈ ప్రశ్నను స్ట్రైట్ గానే ఆముదాలవలస వైసీపీ యువ నేత తమ్మినేని చిరంజీవి నాగ్ ధర్మాన సోదరులకు గురి పెట్టారు. దానికి కారణం ఉంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలలో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుని హోదాలో ధర్మాన క్రిష్ణ దాస్ ఆముదాలవలసలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తమ్మినేని సీతారామ్ ఆయన తనయుడు యువ నేత తమ్మినేని చిరంజీవి నాగ్ హాజరు కాలేదు. అయితే ఈ సమావేశం జరిగిన తీరు పట్ల మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చిరంజీవి నాగ్ ధర్మాన సోదరుల మీద నిప్పులు చెరిగారు. తాము పార్టీలో ఉన్నట్లా లేనట్లా అని ఆయన ప్రశ్నించారు.

మమ్మల్ని టార్గెట్ చేశారు :

స్థానిక సంస్థలలో ఎలా గెలవాలి అన్నది క్యాడర్ కి దిశా నిర్దేశం చేయాల్సిన సభలో తమ్మినేని సీతారాం కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ మండిపడ్డారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ్మినేని సీతారాం కుటుంబాన్ని ఒక కేసులో అరెస్టు చేయాల్సి ఉండగా చేయలేదని అదే ఆముదాలవలస ఇంచార్జ్ అయిన చింతాడ రవి కుమార్ ని అరెస్టు చేశారని విమర్శించారు అని గుర్తు చేశారు. కూన రవికుమార్ ఎమ్మెల్యేగా ఉంటూ తనతో ఉన్న బంధుత్వం వల్లనే ఇలా చేశారు అన్నట్లుగా చిత్రీకరించారని చిరంజీవి నాగ్ మండిపడ్డారు. ధర్మాన సోదరుల మేనల్లుడు టీడీపీలో ఉన్నారు కదా మరి వారు కూడా టీడీపీలో ఉన్నట్లుగా భావించాలా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుతో ఉన్న బంధుత్వం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

తేల్చుకుంటామంటూ :

తాము మొదటి నుంచి పార్టీలో ఉన్నామని అందువల్ల జిల్లా వైసీపీలో తమ స్థానం ఏమిటో తేల్చుకుంటామని తమ్మినేని చిరంజీవ్ నాగ్ స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రతీ నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరు ఉంది. కానీ ఆముదాలవలసలో అది మరీ ఎక్కువగా ఉంది. మాజీ స్పీకర్ వర్సెస్ ధర్మాన సోదరులుగా అది రూపాంతరం చెందింది. దీని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది కూడా తెలియడం లేదు. ఉత్తరాంధ్రాలో వైసీపీకి ఒక్కో జిల్లాలో ఈ పరిస్థితి ఏంటి అని క్యాడర్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తోంది.