తమ్మినేని దువ్వాడ చెట్టాపట్టాల్...వైసీపీ ఏం చేయనుంది ?
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సామాజిక సమీకరణల మధ్య వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
By: Satya P | 29 Sept 2026 10:02 AM ISTశ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సామాజిక సమీకరణల మధ్య వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ జిల్లాలో ఆధిపత్య కులాలను కో ఆర్డినేట్ చేసుకోవడంలో ఫ్యాన్ పార్టీ సతమతం అవుతోంది అని అంటున్నారు. టీడీపీ నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఎపుడూ ఇలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. వైసీపీ మాత్రం తన పదిహేనేళ్ల ప్రస్థానంలో సవాళ్ళు ఎదుర్కొంటోంది. నిజానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల దశాబ్దాలలో వెలమలది రాజకీయంగా ఆధిపత్యం కనిపిస్తోంది. అయినా సరే మిగిలిన సామాజిక వర్గాలను సైతం చేరదీస్తూ టీడీపీ ముందుకు సాగుతోంది. ఆ రకమైన అసంతృప్తి ఆయా కులాల మీద పడనీయకుండా జాగ్రత్త పడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఈ సమీకరణలను సరి చేసుకున్నా ఓటమి తరువాత మాతం పట్టు చిక్కకుండా పోతోంది. ఫలితంగా బలమైన సామాజిక వర్గాల మధ్య పోరు కాస్తా రాజకీయ పోరుగా రూపుదిద్దుకోవడంతో వైసీపీకి జిల్లాలో తీరని నష్టం కలుగుతోంది అని అంటున్నారు.
సీనియర్ మోస్ట్ లీడర్ గా :
జిల్లా రాజకీయాలలో తమ్మినేని సీతారాం ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన 1983లోనే గెలిచి వచ్చిన వారు. అంతే కాదు అయిదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు మంత్రిగా చేశారు. శాసనసభ స్పీకర్ గా అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. వీటికి మించి శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు. గతంలో ఇదే జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాల్ వంటి నాయకులు కీలకంగా ఉండేవారు. ఆయన ఎన్నో సార్లు ఎంపీగా పనిచేశారు. ఇక ఇదే జిల్లాలో వెలమలు వర్సెస్ కాళింగులుగా రాజకీయం సాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక వెలమలకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ కాళింగులకు పెద్ద పీట వేసింది. వైసీపీ అయితే రెండు వర్గాలను దగ్గరకు తీసే క్రమంలో ఎక్కడో సమతూల్యత కొరవడింది అన్న భావన వల్లనే కాళింగులు ఇపుడు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
వరుస పరిణామాలు :
కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ సస్పెండ్ చేయడం తమ్మినేనికి ప్రాధాన్యత తగ్గడం, మరో కీలక నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం ఈ సామాజిక ఆధిపత్య పోరుతోనే వైసీపీని వీడడం వంటి పరిణామాలతో ఆ సామాజిక వర్గంలో ఇపుడు చర్చ సాగుతోంది. వైసీపీకి దన్నుగా ఉంటూ వచ్చిన వారే ఇపుడు కొంత ఎడం పాటిస్తున్నారు. జిల్లాలో ధర్మాన సోదరులు చెప్పినట్లుగానే పార్టీ నడుస్తోంది అన్న భావన కాళింగ సామాజిక వర్గంలో ఉండడంతో పాటు అధినాయకత్వం వైపు నుంచి కూడా సరైన స్పందన లేదన్న ఆలోచనలు వారిలో కలుగుతున్నాయని అంటున్నారు.
కొత్త రాజకీయం :
ఈ పరిణామాల నేపధ్యంలో ఇటీవల తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ ధర్మాన సోదరుల మీద మీడియా ముఖంగానే విమర్శలు చేశారు. ఆ తరువాత అధినాయకత్వాన్ని తమ్మినేని సీతారాం కలిసి వచ్చారు. ఆయనకు ఎంపీగా పోటీ చేసే చాన్స్ ఇస్తామని హామీ లభించింది అని ప్రచారం సాగింది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ తమ్మినేని చెట్టాపట్టాల్ వేయడం తో జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు ఆస్కారం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఇంకో వైపు దువ్వాడ శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరుతారు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ధర్మాన సోదరుల మీద విమర్శలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడను తిరిగి చేర్చుకుంటే మరోసారి పార్టీలో వర్గ పోరు హెచ్చుతుందని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే వైసీపీలో రాజకీయం సామాజికం కూడా రెండుగా చీలినట్లుగా కనిపిస్తోంది. మరి దీనిని వైసీపీ ఎలా సరిచేస్తుంది అన్నదే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
