Begin typing your search above and press return to search.

దర్శన సామర్థ్యం 3 వేలు.. వచ్చింది 25 వేలు!

ప్రమాదం చోటుచేసుకున్న సమయానికి ఆలయంలో సుమారు 25 వేల మంది భక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   1 Nov 2025 1:51 PM IST
దర్శన సామర్థ్యం 3 వేలు.. వచ్చింది 25 వేలు!
X

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినా, పోలీసులకు దేవాదాయశాఖ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. అంతేకాకుండా ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లే మార్గం, తిరిగి వచ్చే మార్గం ఒకటే ఉండటం వల్ల కూడా రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారితీసిందని అంటున్నారు.

శనివారం కార్తీకమాస ఏకాదశి కావడంతో కాశీబుగ్గ చుట్టుపక్కల నుంచి వేల మంది భక్తులు తరలివచ్చారని చెబుతున్నారు. ఈ ఆలయంలో సుమారు మూడు వేల మంది దర్శనాలకు అవకాశం ఉండగా, శనివారం వేకువజామునే వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు చెబుతున్నారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయానికి ఆలయంలో సుమారు 25 వేల మంది భక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు అంచనా వేస్తున్నారు.

అదేవిధంగా ప్రమాదానికి ఆలయ నిర్వహకుడు హరి ముకుంద పండ చేదస్తం కూడా ప్రధాన కారణంగా విమర్శిస్తున్నారు. సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించిన హరి ముకుంద పండా ఎవరి నుంచి సహాయం తీసుకోరని అంటున్నారు. 95 ఏళ్ల వృద్ధుడైన ఆయన తన పని తానే చేసుకుంటాడని, కనీసం ఎవరైనా చేయి అందించి అతడికి సాయం చేయాలని భావించినా, మడి పేరుతో ముట్టుకోడని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ఆలయంలో సహాయ కార్యక్రమాలకు ఎవరూ ముందు వెళ్లలేదని అంటున్నారు.

ఇక ఏకాదశి కారణంగా ఉపవాస దర్శనానికి వెళ్లిన భక్తులు తొందరగా బయటకు రావాలనే ఆత్రుత కూడా ప్రమాదానికి దారితీసిందని అంటున్నారు. ఇరుకు ద్వారం వద్ద దర్శనం కోసం భక్తులు ఎగబడటం వల్ల తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ఈ తొక్కిసలాటలో మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 9 మంది మహిళలే ఉన్నారు. మృతుల్లో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.