శ్రీకాకుళం టీడీపీలో కులం కార్డు
శ్రీకాకుళం జిల్లాలో ఇపుడు అధికార పార్టీ టీడీపీలో కులం కార్డు హాట్ టాపిక్ గా మారుతోంది.
By: Satya P | 2 Sept 2025 9:22 AM ISTశ్రీకాకుళం జిల్లాలో ఇపుడు అధికార పార్టీ టీడీపీలో కులం కార్డు హాట్ టాపిక్ గా మారుతోంది. కులం కార్డుతో అందలాలు అందుకోవాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో తేలక అధినాయకత్వం తల పట్టుకునే నేపథ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయం అంటే కనుక కింజరాపు ఫ్యామిలీయే ముందు కనిపిస్తుంది. దివంగత ఎర్రన్నాయుడు నుంచి టీడీపీలో ఆ కుటుంబం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
మూడు ముక్కలాట :
ఇక టీడీపీ ఆవిర్భవించాక రాజకీయం కూడా మూడు ముక్కలాటగా మారింది. అయితే టీడీపీ ఏ ఒక్క కులాన్ని ఇబ్బంది పెట్టకుండా పదవుల పంపిణీ చేస్తూ వచ్చింది. ప్రధానంగా వెలమలు, తూర్పు కాపులు కాళింగులు జిల్లాలోని రాజకీయాన్ని శాసిస్తున్నారు. జనాభా పరంగా సామాజిక వర్గాల పరంగా మూడూ సరిసమానంగా ఉండడంతో అవకాశాలు కూడా అలాగే దక్కించుకునేవారు ఆ విధంగానే ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, కిమిడి కళా వెంకట్రావు వంటి వారు టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నారు అని చరిత్ర చెబుతోంది.
అధ్యక్ష పీఠం కోసం :
ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఇపుడు టీడీపీలో భారీ పోరు సాగుతోంది. ఈ పదవి తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతూ ప్రధాన కులాలు అధినాయకత్వం వద్ద విన్నపాలు చేసుకుంటున్నాయి. వెలమలకు సంబంధించి చూస్తే బాబాయ్ అచ్చెన్నాయుడు, అబ్బాయ్ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి కాకుండా తూర్పు కాపుల నుంచి అయినా లేక కాళింగుల నుంచి అయినా కొత్త ప్రెసిడెంట్ ని ఎంపిక చేయాలని డిమాండ్ వస్తోంది. దాంతో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు రేసులోకి దూసుకుని వస్తున్నారు.
కాపులకే ఇవ్వాలట :
అయితే ఇందులో కూడా మరో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. కాళింగుల నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కి ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చారని ఇది కేబినెట్ ర్యాంక్ తో కూడుకున్నదని గుర్తు చేస్తున్నారు. అందువల్ల తూర్పు కాపులకు ఏ పదవీ లేదని వారికే జిల్లా ప్రెసిడెంట్ పదవిని ఇస్తే సామాజిక న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారుట. అలా తూర్పు కాపులు వర్సెస్ కాళింగుల మధ్య ఈ పదవి కోసం విపరీతమైన పోటీ సాగుతోంది. అంతే కాదు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుని విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపించేశాక కాపులకు శ్రీకాకుళం జిల్లాలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం టీడీపీ నుంచి ఉండడం లేదని అంటున్నారుట. దాంతో తమకే చాన్స్ ఇవ్వాలని కాపులు పట్టుబడుతున్నారుట. ఇక టీడీపీ అధినాయకత్వం చూస్తే కనుక కాపులకే ఇవ్వాలని డిసైడ్ అయిందని చెబుతున్నారు. అయితే డైనమిక్ గా ఉండే వారికి జిల్లాలో పార్టీని పటిష్టం చేసేవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి సిక్కోలు టీడీపీని కాపు కాసేది ఎవరో.
