Begin typing your search above and press return to search.

పూర్వ వైభవం కోసం కాళింగుల శపధం

ఇదిలా ఉంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తగ్గి ఏపీలో అంతరించాక కాళింగులకు రాజకీయంగా అవకాశాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు.

By:  Satya P   |   31 Dec 2025 2:00 PM IST
పూర్వ వైభవం కోసం కాళింగుల శపధం
X

ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం సామాజిక సమీకరణల మీద ఆధారపడి దశాబ్దాలుగా సాగుతూ వచ్చింది. ఇక్కడ ప్రధాన సామాజిక వర్గాలలో కాళింగులు వెలమలు తూర్పు కాపులు అత్యంత కీలకంగా ఉంటారు. ఇక రాజకీయంగా చూస్తే పదవులు కూడా ఈ సామాజిక వర్గాలకే దక్కాయి. జిల్లా నేపథ్యం చూసినపుడు కాళింగులు ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వారి పంట పండింది అని చెప్పాలి. శ్రీకాకుళం ఎంపీ సీటుని దశాబ్దాల పాటు వారే గెలుచుకుని అక్కడ జెండా పాతారు. అంతే కాదు అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో వారి సత్తా చాటుకున్నారు.

టీడీపీ హయాంలో :

ఇక తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మరో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న వెలమల పాత్ర విశేషంగా పెరిగింది అపుడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి చేరిన కాళింగ నేతలు కీలకమైన హోదాలను దక్కించుకున్నారు అలా హనుమంతు అప్పయ్య దొర శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున తొలి ఎంపీ అయ్యారు. కాళింగ సామాజిక వర్గం నుంచి బొడ్డేపల్లి రాజగోపాల్ 1952 నుంచి మొదలెట్టి 1980 దాకా పాతికేళ్ళ పాటు సిక్కోలు ఎంపీగా అయిదు సార్లు పనిచేశారు. కణితి విశ్వనాధం కిల్లి కృపారాణి కలిపి పన్నెండేళ్ళ పాటు పాలించారు. ఈ విధంగా చూస్తే మొత్తం డెబ్బై ఏళ్ళ పార్లమెంటరీ చరిత్రలో ఎంపీ సీటు కాళింగులకు 42 ఏళ్ళ పాటు దక్కింది. కింజరాపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు నాలుగు సార్లు గెలిచి పదమూడేళ్ళ పాటు ఎంపీగా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీగా ఉన్నారు. ఇలా వెలమల నుంచి చూస్తే రెండున్నర దశాబ్దాలకు పైగా సిక్కోలు ఎంపీ పీఠం దక్కినట్లు అయింది.

తగ్గిన ప్రాధాన్యత :

ఇదిలా ఉంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తగ్గి ఏపీలో అంతరించాక కాళింగులకు రాజకీయంగా అవకాశాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. టీడీపీ వైసీపీలలో వెలమలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారినే ముందు వరసలో ఉంచి రాజకీయం చేయడంతో తమ సొంత పార్టీలలో విలువ లేకుండా పోతోంది అని కాళింగులు తీవ్ర అసంతృప్తితో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కాళింగుల ఆత్మీయ సమ్మేళనం ఇపుడు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చను రేపుతోంది. జిల్లాలో రాజకీయ సామాజిక సమీకరణలను మార్చేందుకే ఈ సమావేశం జరిగింది అని అంటున్నారు.

అంతా ఒక్కటిగా :

పార్టీలు వేరు అయినా వెలమలు లోలోపల పరోక్షంగా సహకరించుకుంటూ రాజకీయంగా వెలుగుతున్నారని ఆ ఐక్యత కాళింగులలో కూడా రావాలన్న భావన అయితే సమ్మేళనంలో వ్యక్తం అయింది అని అంటున్నారు. ఇక కాళింగుల విషయం చూస్తే తమ్మినేని సీతారాం ఆ సామాజిక వర్గం నుంచి జిల్లాలో చివరి మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత టీడీపీ వైసీపీ ఎవరికీ ఆ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు ఎవరివి అయినా తమకు అన్యాయం జరుగుతోంది అన్నది వారి వేదనగా ఉంది అంటున్నారు.

రాజకీయ సంకటమే :

జిల్లాలో కాళింగులు అంతా ఒక త్రాటి మీదకు వచ్చి రాజకీయం చేస్తే అది ప్రధాన పార్టీలకు రాజకీయ సంకటంగా పరిణమిస్తుంది అని అంటున్నారు. ఇక రెండు దశాబ్దాలుగా తమ చేతులలో లేని శ్రీకాకుళం ఎంపీ పదవిని ఈసారి గెలుచుకోవాలని కాళింగ సామాజిక వర్గం భావిస్తోంది అని అంటున్నారు. అలాగే సామాజికపరంగా ఐక్యత చూపిస్తేనే జిల్లాలో పదవులు దక్కుతాయని కూడా లెక్క వేసుకుని మరి ముందుకు సాగుతోంది అని అంటున్నారు. మొత్తానికి జిల్లాలో రాజకీయంగా ఈ సమావేశం చర్చకు దారి తీస్తోంది అని అంటున్నారు.