Begin typing your search above and press return to search.

కత్తులు దించారు... కలసి కట్టుగా ముందుకు !

ఒకరి మీద ఒకరు రాజకీయ ప్రత్యర్ధి చూసుకుంటూ కత్తులు దూసుకునే వారు, తమలో తామే కలహించుకుని పోటీ పడేవారు

By:  Satya P   |   15 Jan 2026 4:00 PM IST
కత్తులు దించారు... కలసి కట్టుగా ముందుకు !
X

ఒకరి మీద ఒకరు రాజకీయ ప్రత్యర్ధి చూసుకుంటూ కత్తులు దూసుకునే వారు, తమలో తామే కలహించుకుని పోటీ పడేవారు. దాంతో తాము పూర్తిగా దెబ్బ తిన్నామని గ్రహించారు. ఇపుడు తమ సామాజిక వర్గంలో తమ రాజకీయ అస్థిత్వం కోసం అంతా ఒక్కటి అవుతున్నారు. ఈ విషయంలో రాజకీయ విభేదాలను వ్యక్తిగత అజెండాలను సైతం పక్కన పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అంతా ఒక్క త్రాటి పైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆత్మీయ సమావేశాలతో :

ఈ మధ్యనే ఆత్మీయ సమావేశాల పేరుతో అంతా ఒక్క చోటకు చేరారు. మేనమామ మేనల్లుడు మధ్యన ఆముదాలవలసలో భీకరమైన రాజకీయ పోరు సాగుతూ ఉండేది, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అలాగే మేనల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్ ల మధ్య రాజకీయ విభేదాలు కూడా ఎపుడూ తారస్థాయిలో సాగుతూ ఉండేవి. కానీ ఇపుడు సీన్ మారుతోంది. కూన తమ్మినేని ఒక చోటకు చేరుకుంటున్నారు చేతులు కలుపుతున్నారు, నవ్వులు చిందిస్తున్నారు. దానికి ఎవరి రాజకీయాలు ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి అని చెప్పక తప్పదు.

అసంతృప్తితోనే :

తమ్మినేని సీతారాం విషయానికి వస్తే ఆముదాలవలస ఇంచార్జి గా తనను పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆ ప్లేస్ లో చింతాడ రవికుమార్ అనే కొత్త నేతను ఎంపిక చేశారు. దాంతో తమ్మినేని పార్టీ కార్యక్రమాలను దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ ఆయనను శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జిగా నియమించినా కూడా పెద్దగా రెస్పాండ్ అవడం లేదని అంటున్నారు ఇక కూన రవి కుమార్ విషయానికి వస్తే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి సీనియర్ అనిపించుకున్నా సామాజిక కోణంలో చూసినా మంత్రి పదవి దక్కాలని కానీ రాలేదని ఆవేదనతో ఉన్నారు. దాంతో పాటుగా గతంలో ఇచ్చిన ప్రభుత్వ విప్ పదవి కూడా ఈసారి దక్కలేదని బాధ ఉంది అంటున్నారు.

ఆ ఇద్దరూ సైతం :

ఇక కేంద్రంలో మంత్రిగా పనిచేసి ఒక స్థాయిలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కిల్లి కృపారాణి కూడా బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలుగా ఉన్నారు. ఆమె 2009లో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి అప్పటి దిగ్గజ నేత టీడీపీ సిట్టింగ్ ఎంపీ అయిన ఎర్రన్నాయుడిని ఓడించి మరీ విజేత అయ్యారు. అలా యూపీయే టూలో కేంద్ర మంత్రిగా పదవిని అందుకున ఆమె ఆ తరువాత మాత్రం పెద్దగా రాణినలేకపోయారు. వైసీపీలో చేరినా టెక్కలి సీటు కానీ ఎంపీ సీటు కానీ రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు కానీ దక్కలేదు, దాంతో ఆమె వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో కీలకంగా వ్యవహరించారు, కానీ ఆయన సస్పెండ్ అయ్యారు. దాంతో ఆయన కూడా కాళింగ సామాజిక వర్గం ఇక్యత కోసం కృషి చేస్తున్నారు

కులమే బలమైనది :

గతంలో టెక్కలి రాజకీయాల కోసం కృపారాణి దువ్వాడ కూడా పోరు సాగించారు, ఇపుడు ఈ ఇద్దరు నేతలు కూడా కులమే బలమైనది అని నమ్ముతూ ఒక వేదిక మీదకు వస్తున్నారు. వీరంతా కలసి సంక్రాంతి వేళ సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి తమ రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని చూస్తున్నారు జిల్లాలో రాజకీయంగా పై చేయి సాధించిన వెలమ సామాజిక వర్గానికి ధీటుగా తాము కూడా ఎదగాలని వ్యూహ వచన చేస్తున్నారు. పార్టీలు వేరు అయినా కుల బలం రాజకీయ బలం పెంచుకోవాలని అంతా కలసి కట్టుగా సాగాలని తీర్మానిస్తున్నారు. దీంతో జిల్లాలో ఈ సామాజిక పరిణామాలు కొత్త రాజకీయానికి నాంది పలకబోతున్నాయని అంటున్నారు.