సిక్కోలు తొలి మేయర్ ఎవరు ?
రాష్ట్రంలో అన్ని కార్పోరేషన్లు మునిసిపాలిటీల పదవీ కాలం ఈ నెల 17తో పూర్తి అయింది. ప్రస్తుతం అంతటా ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.
By: Satya P | 23 March 2026 11:08 PM ISTరాష్ట్రంలో అన్ని కార్పోరేషన్లు మునిసిపాలిటీల పదవీ కాలం ఈ నెల 17తో పూర్తి అయింది. ప్రస్తుతం అంతటా ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. అయితే చిత్రంగా ఏపీలో ఒక కార్పోరేషన్ లో మాత్రం ఎపుడూ ప్రత్యేక అధికారుల పాలన మాత్రమే సాగుతోంది. అక్కడ ఎన్నికలు చూసి పుష్కర కాలం గడచింది. పేరుకు కార్పొరేషన్ గా చేశారు కానీ ఎన్నికలు మాత్రం ఇంతదాకా పెట్టలేదంటే వింతే మరి. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే న్యాయపరమైన చిక్కులు అంటున్నారు. దాంతో శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు లేకుండానే ప్రజా ప్రతినిధులు రాకుండానే పుణ్య కాలం కాస్తా అలా సాగిపోతోంది.
మునిసిపాలిటీ నుంచి :
ఇక శ్రీకాకుళం మునిసిపాలిటీ నుంచి కార్పోరేషన్ గా అప్ గ్రేడేషన్ పొందింది. చివరిసారిగా మునిసిపాలిటీకి 2006లో ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత కార్పొరేషన్ ని చేస్తూ సమీపంలోని గ్రామాలని అందులో విలీనం చేశారు. అయితే తాము విలీనం కామని కొందరు కోర్టుకు వెళ్ళడంతో ఇబ్బంది ఏర్పడింది. ఇక ఉమ్మడి ఏపీలో 2014 ఎన్నికల ముందు రాష్ట్రమంతా స్థానిక ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో శ్రీకాకుళం మునిసిపాలిటీకి న్యాయ చిక్కులు అన్న కారణంతో ఎన్నికలు పెట్టలేదు. ఇక 2021లో వైసీపీ స్థానిక ఎన్నికలను అంతటా పెట్టి శ్రీకాకుళంలో ఇదే కారణంతో జరిపించలేదు. ఇపుడు మరోసారి సిక్కోలు కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ మొదలైంది.
మేయర్ పీఠం కోసం :
ఎన్నికలు జరిగితే సిక్కోలు తొలి మేయర్ పీఠం మీద చాలా మంది ఆశలు పెంచుకున్నారు. తామే ఈ పీఠం అందుకోవాలని కలలు కంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలొ ఉన్నపుడు అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ మనోహర్ నాయుడు చూపు మేయర్ సీటు మీద ఉందని ప్రచారం సాగింది. అయితే ఎన్నికలు అయితే పెట్టలేదు, ఇక ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. కూటమి నుంచి అనేక మంది మేయర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. చెప్పాలి అంటే మూడు పార్టీల నుంచి డిమాండ్ ఎక్కువగానే ఉంది. సీనియర్ రాజకీయ నేతలు తమ కుమారులను మేయర్ గా చూసుకోవాలని తపన పడుతున్నారు. ఇక సిక్కోలుకి ఇపుడైనా ఎన్నికలు ఉంటాయా లేదా అన్నది తెలియడం లేదు.
స్పెషల్ కార్పోరేషన్ :
సాధారణంగా ప్రత్యేక అధికారుల పాలన ఏడాది రెండేళ్లు సాగుతుంది. కానీ పుష్కర కాలంగా సాగడం శ్రీకాకుళం స్పెషాలిటీ అని అంటున్నారు. ప్రభుత్వం తలచుకుంటే న్యాయ చిక్కు ముళ్ళు విప్పడం సులువే అని అంటున్నారు. ప్రజా ప్రతినిధులు ఉంటే అభివృద్ధి సాగుతుందని గుర్తు చేస్తున్నారు. గతంలో టీడీపీ ఒక్కటే ఉంది కాబట్టి ఎంత ఒత్తిడి చేసినా పని చేయలేదు, ఇపుడు మూడు పార్టీలూ పెద్దగానే ఒత్తిడి తెస్తున్నాయి, దాంతో మరో ఆరు నెలలలో జరిగే కార్పోరేషన్ల ఎన్నికల లిస్ట్ లో సిక్కోలు కూడా ఉంటుందా అన్న చర్చ సాగుతోంది
