ఎయిర్ పోర్టు కట్టకపోతే మంత్రిగా ఎందుకు...లాజిక్కే మరి !
పదవులు అలంకారాలు మాత్రమే కాదు, బాధ్యత కూడా. సీట్లో కూర్చున్న వారికి లక్షా ముప్పాతిక తలనొప్పులు ఉంటాయి.
By: Satya P | 6 Oct 2025 9:25 AM ISTపదవులు అలంకారాలు మాత్రమే కాదు, బాధ్యత కూడా. సీట్లో కూర్చున్న వారికి లక్షా ముప్పాతిక తలనొప్పులు ఉంటాయి. దాంతో పాటు అనేక సవాళ్ళు స్వపక్షం నుంచి విపక్షం నుంచి కూడా ఉంటాయి. వీటికి మించి జనంలో మార్కులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయిదేళ్ళ పాటు అధికారం చలాయించిన తరువాత ఓట్ల కోసం జనాల ముందుకు వెళ్తే చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉండాలి కదా మరి. అదే సిక్కోలు జిల్లాకు చెందిన యువ నేత కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులో కూడా కలుగుతున్న భావన. ఆయన హ్యాట్రిక్ ఎంపీ. మంచి మాటకారి. సబ్జెక్ట్ కూడా ఉంది. సమర్ధుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గట్టిగా నాలుగు పదులు కూడా నిండకుండానే కేంద్రంలో టాప్ పోర్ట్ ఫోలియోల్లో ఒకటైన విమాన శాఖను అందుకున్నారు.
జిల్లాకు ఎయిర్ పోర్టు :
తన సొంత జిల్లాకు ఎయిర్ పోర్టుని తీసుకుని వస్తాను అని కేంద్ర మంత్రి అంటున్నారు. కార్గో ఎయిర్ పోర్టుని జిల్లాలోని పలాసలో నిర్మించాలని ఆయన చూస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రతిపాదించారు. ఎటూ ఆయన శాఖే కాబట్టి కేంద్రం నుంచి నో అబ్జక్షన్. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి. ఆయనే ఏపీలో 2024 కి ముందు ఉన్న ఏడు ఎయిర్ పోర్టులను 14గా చేయాలని కేంద్ర మంత్రికి సూచించారు. అందులో ఒకటి శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తామంటే చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అసలైన సమస్య ఇపుడు వచ్చి పడింది.
భూ సమీకరణతోనే :
పలాసలో ఎయిర్ పోర్టు కట్టాలీ అంటే భారీ ఎత్తున భూసేకరణ జరగాలి. ల్యాండ్ పూలింగ్ విధానం టీడీపీకి బాగా అచ్చి వస్తోంది. అమరావతిలో సునాయాసంగా 33 వేల ఎకరాలను తీసుకున్నారు. ఇపుడు అదే విధంగా కార్గో ఎయిర్ పోర్టు కోసం ల్యాండ్ పూలింగ్ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఉద్ధానం తదితర ప్రాంతాలలో భూములను ఇవ్వడానికి రైతులు కొంతమంది అంగీకరించడం లేదు. వారు కొబ్బరి తోటలతో తమకు గణనీయంగా ఆదాయం వస్తోందని అంటున్నారు. వామపక్షాలు సైతం కార్గో ఎయిర్ పోర్టు ఎందుకు దండుగ అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోటు పక్కనే ఉండగా మళ్ళీ ఎందుకు అంటున్నారు. దాంతో భూ వివాదం రాజుకుంటోంది.
ఉపాధి కల్పన కోసమే :
అయితే మూలపేటలో పోర్టు నిర్మాణం అవుతోందని రానున్న రోజులలో ఎయిర్ పోర్టు కూడా ఉంటే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర మంత్రి అంటున్నారు. అంతే కాదు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఎయిర్ పోర్టు లేదని చెబుతున్న వారికి కూడా దీనిని నిర్మించి మాట్లాడే చాన్స్ లేకుండా చేద్దామని కేంద్ర మంత్రి అంటున్నారు. భూసమీకరణ ద్వారా భూములు ఇస్తే వారికి నష్టం కలుగకుండా చూస్తామని అంటున్నారు. కార్గో ఎయిర్ పోర్టు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పైలెట్ ట్రైనింగ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
ఒడిశా పోటీకి వస్తోంది :
పలాస వద్ద కార్గో ఎయిర్ పోర్టుని తాము నిర్మిస్తామని చెప్పగానే ఒడిషా నుంచి కూడా తమకు ఎయిర్ పోర్టు ఒకటి కావాలని ప్రతిపాదన వచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ చెప్పారు అంతే కాదు అనేక మంత్రి ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి తమకు ఎయిర్ పోర్టులు కావాలని విజ్ఞాపనలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇలా దేశమంతా పోటీ పడుతున్న పౌర విమానయాన రంగం విషయంలో జిల్లాకు తాను మంత్రిగా ఉండి ఏమీ చేయకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అందుకే తాను కచ్చితంగా ఎయిర్ పోర్టు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు భూములు ఇవ్వాలని కోరారు. మీ కొబ్బరి చెట్టూ ఎదగాలి ఎయిర్ పోర్టూ ఎదగాలని ఆయన వారితో నిర్వహించిన సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్టు వద్దు అంటున్న వారిని ఉపాధిని చూపించాలని రైతులు నిగ్గదీయాలని కూడా ఆయన కోరుతున్నారు. మొత్తానికి రామ్మోహన్ నాయుడు తాను మంత్రిగా జిల్లాకు ఎయిర్ పోర్టు ఇస్తానని ఖరాకండీగా చెబుతున్నారు. మరి అది ఎపుడు శ్రీకారం చుట్టుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.
