ఎస్వీబీసీకి కొత్త ఛైర్మన్.. నందమూరి ఫ్యామిలీ సమక్షంలో ఘనంగా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం!
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ అత్యంత గ్రాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
By: Madhu Reddy | 22 Aug 2026 8:37 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ అత్యంత గ్రాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలో ఉన్న ఎస్వీబీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కూటమి నాయకులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు:
తనకు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఎంతో బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు శ్రీధర్ వర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఇక ఎస్వీబీసీ అభివృద్ధి కోసం ఉద్యోగులందరినీ కలుపుకుని, సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు.
హజరైన ప్రముఖులు.. నందమూరి కుటుంబం ఆనందం:
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణ, మోహన రూపా, కామినేని సీమంతిని, దగ్గుబాటి నివేదిత హాజరయ్యారు. వీరితో పాటు ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత భూషణ్, నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొని శ్రీధర్ వర్మకు అభినందనలు తెలియజేశారు. సీనియర్ ఎన్టీఆర్ ఆత్మీయుడైన 'ఎన్టీఆర్ రాజు' కుమారుడు శ్రీధర్ వర్మకు ఈ పదవి దక్కడంపై నందమూరి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
ఎన్టీఆర్ రాజు వారసత్వానికి తగిన గౌరవం:
స్వర్గీయ ఎన్టీఆర్ కాలం నుంచి రాజు గారి కుటుంబం తమకు ఎంతో అండగా నిలిచిందని నందమూరి మోహన్ కృష్ణ, రామకృష్ణలు గుర్తు చేసుకున్నారు. శ్రీవారి సేవ కోసం నాడు రాజు గారు స్వయంగా భూమిని కూడా దానం చేశారని చెప్పారు. ఇక నాలుగు తరాలుగా స్వామివారి సేవలో ఉన్న ఆ కుటుంబ వారసుడికి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి దక్కడం ఎంతో సంతోషకరమని, శ్రీధర్ వర్మ ఈ ఛానల్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
భక్తి ఛానల్ రంగంలో ఎస్వీబీసీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ రాజు గారి నిస్వార్థ సేవలను, విలక్షణమైన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీధర్ వర్మ నాయకత్వంలో ఎస్వీబీసీ ఛానల్ రాబోయే రోజుల్లో కొత్త శిఖరాలను అధిరోహించి, కోట్లాది మంది భక్తులకు మరింత చేరువవుతుందని భావిస్తున్నారు..
