గొప్ప పని: గ్రాఫ్ పోయింది రెడ్డీగారూ ..!
''ఆయన చేసిన పని.. ఆయనకే ఇబ్బంది తెచ్చింది. ఆయన మౌనంగా ఉండి ఉంటే సరిపోయేది.
By: Garuda Media | 27 Aug 2025 11:49 PM ISTకుండెడు పాలలో ఒక్క ఉప్పు గల్లు పడితే.. మొత్తం పాలన్నీ నాశనం అయినట్టుగా.. ఇప్పటి వరకు ఎంత మంచి చేసినా.. ఎంత పేరు తెచ్చుకున్నా.. తాజాగా చేసిన చిన్న పని.. ఆ నాయకుడి పేరును పటాపంచ లు చేసింది. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు సదరు నేతంటే.. ఉన్న గౌరవం, మర్యాద కూడా.. పోగొ ట్టుకున్నారు. నిన్నటి వరకు ఆయనంటే ఎంతో గౌరవం.. మర్యాద.. గ్రాఫ్ కూడా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ఆయనను లూపు లైన్‌లో పెట్టేశారని పార్టీలో చర్చ సాగుతోం ది.
''ఆయన చేసిన పని.. ఆయనకే ఇబ్బంది తెచ్చింది. ఆయన మౌనంగా ఉండి ఉంటే సరిపోయేది. పెద్ద బాబు, చిన్నబాబు ఇద్దరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ముందు ముందు.. ఏం జరుగుతుందో తెలియదు'' అని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇంతకీ.. చిన్నబాబు, పెద్దబాబుల ఆగ్రహానికి గురైన నాయ కుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు వైసీపీపై నిప్పులు చెరిగి.. ఒక పెద్ద యుద్ధమే చేసి.. బయటకు వచ్చిన శ్రీధర్.. ఆ వెంటనే టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.
విజయం వరించింది. మంత్రివర్గంలో చోటు ఆశించారు. వాస్తవానికి వైసీపీతో విభేదించడానికి ఈ మంత్రి పదవే కారణమన్న విషయం తెలిసిందే. అయితే.. టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. అయినా.. ప్రభుత్వం తరఫున బలమైన గళం వినిపిస్తున్నారన్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. సొంతగా నియోజకవర్గంలో నిధులు సేకరించి పనులు కూడా చేపట్టారు. వీటిని చంద్రబాబు, నారా లోకేష్‌లకు అంకితం కూడా ఇస్తున్నట్టు ప్రకటించి.. మెప్పు పొందారు.
కానీ, కంచం నిండా అన్నం పెట్టి.. చివరిలో ఉమ్ము వేసినట్టు.. వైసీపీకి చెందిన శ్రీకాంత్ అనే జీవిత ఖైదీకి.. పెరోల్ ఇప్పించే విషయంలో శ్రీధర్ రెడ్డి చేసిన ప్రయత్నం.. మొత్తం వ్యవహారాన్ని మైనస్ చేసేసింది. అంతేకాదు.. ఆయనపై అనుమానాలు కూడా పెంచేసింది. వైసీపీ నుంచి వచ్చినా.. టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తున్నారని నిన్నమొన్నటి వరకు అనుకున్న నాయకులు ఇప్పుడు ఆయనను అన్ని కోణాల్లోనూ అనుమానించే పరిస్థితికి దిగజారారు. తాజాగా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు.. ఆయన గురించి నాకేమీ చెప్పొద్దు.. అని తేల్చేశారు. ఇదీ.. సంగతి!!
