Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర

విజయనగరంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మ వారు ఆ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సంస్థానాధీశుల ఇలవేలుపుగా పేర్కొంటారు.

By:  Satya P   |   7 Oct 2025 1:00 PM IST
ఉత్తరాంధ్రాలో అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర
X

విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మ వారి జాతర మహోత్సవం ప్రతీ ఏటా ఆశ్వియుజ మాసంలో అత్యద్భుతంగా సాగుతుంది. ఉత్తరాంధ్రాలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతరగా పేరు గడించింది. ఈ జాతరకు ఏకంగా రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. పైడితల్లి అమ్మ వారిని ఉత్తరాంధ్రా వాసులతో పాటు పొరుగు రాష్ట్రాలు అయినా ఒడిశా చత్తీస్ ఘడ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఆరాధిస్తారు. రెండు రోజుల పాటు సాగే ఈ మహోత్సవం విజయనగరం వైభవానికి అచ్చమైన నిదర్శనం.

పూసపాటి వారి ఇలవేలుపు :

విజయనగరంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మ వారు ఆ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సంస్థానాధీశుల ఇలవేలుపుగా పేర్కొంటారు. 1758లో అమ్మ వారి ఆలయం తో పాటు ఉత్సవాలు కూడా మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. విజయనగరంలో స్థానిక మూడు లాంతర్ల వద్ద ఆలయం నిర్మించి పూసపాటి రాజులు అమ్మ వారికి తొలి పూజ చేశాక ఉత్సవాలు మొదలవుతాయి. ప్రతీ ఏటా విజయదశమి పండుగ వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం అమ్మ వారి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇక వెనక్కి చూస్తే 1757లో విజయదశం వెళ్ళిన మంగళవారం అమ్మ వారి విగ్రహాన్ని స్థానిక పెద్ద చెరువులో నుంచి బయ్హటకు తీశారు. అలా తీసిన వారు పతివాడ అప్పలస్వామి అనే ఆయన. దాంతో పతివాడ వంశీకులే అమ్మ వారికి పూజారులుగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆలయంలో పూజలు చేసే ఆ పూజరే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.

రాజుల ఆడపడుచుగా :

ఇక చరిత్రలో చూస్తే పైడితల్లి అమ్మ వారు పూసపాటి పెద విజయరామ రాజు తోడబుట్టిన చెల్లెలు. ఆమె చిన్ననాటి నుంచి భక్తిగా ఉంటీ దేవీ ఉపాసనలు చేస్తూ వచ్చేవారు. అయితే ఆమె అన్న బొబ్బిలి రాజుల మీద యుద్ధం చేయడానికి పూనుకోవడంతో ఆ యుద్ధం ఆపించాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయినా పెద విజయరామరాజు లెక్కచేయకుండా 1757లో బొబ్బిలి మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో విజయరామరాజు గెలిచారు. అయితే తన అన్న ప్రాణాలకు ముప్పు ఉందని పైడితల్లికి కలలో అమ్మ వారు కనిపించి చెబుతారు. దాంతో ఆమె తన అన్నను రక్షించేందుకు కొందరు అనుచరులతో బొబ్బిలి బయలుదేరుతారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ మీదట తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యిందన్నది చారిత్రక గాధ. అలా ఆమె పూసపాటి రాజుల ఇల వేలుపుగా విజయనగరం ప్రజల అమ్మ గా అవతరించారు అని చరిత్రలో చెబుతారు.

సిరిమానోత్సవం ఆకర్షణ :

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో అతి పెద్ద ఆకర్షణగా సిరిమానోత్సవం ఉంటుంది. అతి పెద్ద పొడుగు అయిన కర్రకు చివరిలో ఒక పీఠంగా ఏర్పాటు చేసుకుని ఆ కుర్చీలో పూజారి కూర్చుంటారు. ఇలా అమ్మ వారి కోవెల నుంచి కోట గుమ్మం దాకా మూడు సార్లు సిరిమాను ప్రదక్షిణం చేస్తుంది. భక్తులు అమ్మవారు పూనిన పూజారికి అరటి పండ్లు విసిరి తమ భక్తిని చాటుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలై సాయంత్రం అయిదు దాకా సాగే ఈ ఉత్సవం చూడడానికి లక్షలాది మందిగా భక్తులు తరలి వస్తారు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.