Begin typing your search above and press return to search.

ఎక్కడంటే? 4 లీటర్ల పెట్రోల్ దాచాడని.. 21 రోజుల జైలు.. ఫైన్

పశ్చిమాసియా కల్లోలం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూస్తుండగానే మూడు దేశాల మధ్య యుద్ధం పలు దేశాలకు ప్రాణసంకటంగా మారాయి.

By:  Garuda Media   |   28 March 2026 10:06 AM IST
ఎక్కడంటే? 4 లీటర్ల పెట్రోల్ దాచాడని.. 21 రోజుల జైలు.. ఫైన్
X

పశ్చిమాసియా కల్లోలం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూస్తుండగానే మూడు దేశాల మధ్య యుద్ధం పలు దేశాలకు ప్రాణసంకటంగా మారాయి. ప్రపంచ చమురు అవసరాల్ని తీర్చే దేశాల మీద ఈ యుద్ధ ప్రభావం ఉండటం.. ఆ దేశాల నుంచి ముడి చమురు ఎగుమతులు ఆగిపోవటంతో పలు దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో పెట్రోల్ కొరత భారీగా నెలకొంది. మన పొరుగున ఉన్న శ్రీలంకలో పెట్రోల్ కొరత సమస్య చాలా తీవ్రంగా ఉంది.

ఆ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత మాత్రమే కాదు.. నాలుగు లీటర్ల పెట్రోల్ ను ఇంట్లో ఒక వ్యక్తి రహస్యంగా దాచి ఉంచిన నేరానికి 21 రోజులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి చూస్తే.. ఆ దేశంలో సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోంది. ఈ ఉదంతం ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల కుమార బాలసూర్య ఇంట్లో సోదాలు నిర్వహించగా.. అక్రమంగా నాలుగు లీటర్ల పెట్రోల్ దాచి ఉంచినట్లుగా గుర్తించారు.

దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అయితే.. తన తల్లిదండ్రుల శ్రాద్ధకర్మల నిమిత్తం ఇంటి పరిసరాల్లో చెత్తను తగులబెట్టేందుకు సదరు పెట్రోల్ ను తెచ్చుకున్నట్లుగా చెప్పినా వినలేదు. అతనికి 21 రోజులు జైలుశిక్షతో పాటు రూ.1500 ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. ఇంట్లో దాచి పెట్టింది నాలుగు లీటర్ల పెట్రోల్ అయినా చట్టవిరుద్ధంగా ఉన్నది ఏదైనా చట్టవిరుద్ధమేనని తేల్చింది. దాన్ని నేరంగా పరిగణలోకి తీసుకొని శిక్ష విధించారు.

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో శ్రీలంకలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ సమస్య నడుస్తోంది. దీంతో.. పౌరులు పెట్రోల్, డీజిల్ వాడకంపై అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షల్ని విధించింది. మార్చి 15 నుంచి క్యూఆర్ కోడ్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. దీని ప్రకారం కార్లకు 15 లీటర్లు.. బస్సులకు 60 లీటర్ల చమురును మాత్రమే అనుమతిస్తారు. అంతకు మించి పెట్రోల్ నిల్వ ఉన్నట్లు తేలితే కేసులు నమోదు చేసి.. చట్టపరమైన చర్యలు చేపడతారు.