ఇక, శ్రీచరణి వంతు.. క్రెడిట్ కోసం వైసీపీ పాకులాట!
ప్రముఖ క్రికెటర్.. ఇటీవల జరిగిన ఉమెన్ ప్రపంచకప్ పోటీలో చరిత్రాత్మక విజయం దక్కించుకున్న జట్టులో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి ఏపీకి చేరుకున్నారు.
By: Garuda Media | 7 Nov 2025 12:30 PM ISTప్రముఖ క్రికెటర్.. ఇటీవల జరిగిన ఉమెన్ ప్రపంచకప్ పోటీలో చరిత్రాత్మక విజయం దక్కించుకున్న జట్టులో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి ఏపీకి చేరుకున్నారు. చరిత్రాత్మక పోటీ అనంతరం.. ప్రధానిని కలుసుకున్న జట్టులోని సభ్యులు తాజాగా ఎవరి రాష్ట్రానికి వారు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన శ్రీచరణి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు.
సహజంగానే ఏపీ క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నేతృత్వంలో మంత్రులు, నాయకులు.. ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆమె సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కలుసుకోనున్నారు. ఇదిలావుంటే.. ఈ క్రెడిట్‌లో తమ భాగస్వామ్యం కూడా ఉందంటూ వైసీపీ నాయకులు ప్రకటించడం గమనార్హం. అంతేకాదు.. కొందరు నాయకులు ఆమెకు స్వాగతం కూడా పలికారు.
దీనికి ప్రధాన కారణం.. శ్రీచరణి.. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపకు చెందిన క్రీడాకారిణి. గతంలో ఆమెకు ఎలాంటి సాయం చేశారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఆమె గెలుపు వెనుక తమ ప్రయత్నాలు ఉన్నాయని, మాజీ మంత్రి కడప జిల్లాకు చెందిన అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. `ఆడుదాం ఆంధ్ర`(వైసీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమం) కార్యక్రమంలో భాగంగా తాము శ్రీచరణిని ప్రోత్సహించామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో శ్రీచరణిని మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ఘనంగా సన్మానించనున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నాయకులు.. విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఆమె కోసం బొకేలు కూడా తీసుకువచ్చారు. కానీ.. టీడీపీ నాయకులు కూడా ఇదేసమయంలో శ్రీచరణిని సీఎం చంద్ర బాబు వద్దకు తీసుకువెళ్లేందుకు రావడంతో.. వైసీపీ నాయకులు ఖంగు తిన్నారు. ఇరు వర్గాల ఒత్తిడి శ్రీచరణిపై స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఏమీ మాట్లాడకుండా.. మౌనంగా వేరే కారులో వెళ్లారు. ఆమెను సీఎం వద్దకు తీసుకువెళ్తున్నామని.. మంత్రులు చెప్పారు.
