Begin typing your search above and press return to search.

ప్రేమికుడి కోసం ‘స్పైడర్ ఉమెన్’ అవతారం.. ఇది నిజమైన ప్రేమా? లేక పబ్లిసిటీ స్టంటా?

ప్రేమ మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది అంటారు పెద్దలు. కొందరితో తాజ్‌మహల్ కట్టిస్తే.. మరికొందరితో ప్రపంచాన్ని ఎదిరించేలా చేస్తుంది.

By:  A.N.Kumar   |   24 Jun 2026 11:26 AM IST
ప్రేమికుడి కోసం ‘స్పైడర్ ఉమెన్’ అవతారం.. ఇది నిజమైన ప్రేమా? లేక పబ్లిసిటీ స్టంటా?
X

ప్రేమ మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది అంటారు పెద్దలు. కొందరితో తాజ్‌మహల్ కట్టిస్తే.. మరికొందరితో ప్రపంచాన్ని ఎదిరించేలా చేస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా, రీల్స్ కాలంలో ప్రేమ నెక్స్ట్ లెవల్‌కు కాదు కదా.. ఏకంగా వంద అడుగుల ఎత్తుకు చేరిపోయింది. అవును.. ప్రేమికుడిని జైలు నుంచి విడిపించడం కోసం ఓ యువతి ఏకంగా వంద అడుగుల సెల్ టవర్ ఎక్కి ‘స్పైడర్ ఉమెన్’ రేంజ్‌లో లైవ్ స్టంట్ చేసింది. జార్ఖండ్‌లో జరిగిన ఈ వింత ఘటనను చూసి జనాలు.. "ఇది ప్రేమా? లేక హాలీవుడ్ సినిమా షూటింగా?" అంటూ నోరెళ్లబెడుతున్నారు.

ఇంటర్వెల్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు!

ఈ సినిమా లాంటి స్టోరీ జార్ఖండ్‌లోని బొకారో జిల్లా గోమియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కథలోకి వెళ్తే.. ఈ నెల 18న ఓ తల్లి తన కూతురిని రాంచీకి చెందిన ఒక యువకుడు కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఖాకీలు కూడా వెంటనే రంగంలోకి దిగి ‘ఆపరేషన్ రెస్క్యూ’ చేసి యువతిని తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. విలన్‌లా భావించిన ఆ యువకుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు కూడా పంపారు. ఇక్కడి వరకు కథ అంతా పాత చింతకాయ పచ్చడి సినిమా లాగే సాఫీగా సాగిపోయింది.

అసలు సినిమా ఇక్కడే మొదలైంది.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!

ట్విస్ట్ ఏంటంటే.. హీరో జైలుకు వెళ్లిన కొద్ది రోజులకే మన ‘లేడీ సింగం’ ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో నుంచి సైలెంట్‌గా బయటకు వచ్చి, ఊరి మధ్యలో ఉన్న వంద అడుగుల సెల్ టవర్ ఎక్కేసింది. అంతటితో ఆగకుండా పైనుంచి కేకలు పెడుతూ డైలాగులు అందుకొంది. "అతను నన్ను కిడ్నాప్ చేయలేదు బాబోయ్.. నేనే నా ఇష్టపూర్వకంగా వెళ్లాను. వెంటనే నా ప్రియుడిని జైలు నుంచి విడుదల చేసి, నాతో పెళ్లి జరిపించాలి. లేదంటే ఇక్కడి నుంచే దూకేస్తా!" అంటూ ఊరు మొత్తానికి అల్టిమేటం ఇచ్చింది. ఆమె అరుపులు, కేకలతో గ్రామం మొత్తం టవర్ కిందకు చేరి లైవ్ సినిమా చూడటం మొదలుపెట్టింది. పోలీసులు, ఊరి పెద్దలు, అధికారులు రంగంలోకి దిగి గంటల తరబడి మైకులు పట్టుకుని బ్రతిమిలాడారు. "తల్లీ.. పెళ్లి గురించి చట్టపరంగా మాట్లాడుకుందాం, ముందు కిందికి దిగు" అని నచ్చజెప్పడంతో ఐదు గంటల హైడ్రామా తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె సురక్షితంగా కిందికి దిగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నెటిజన్ల మీమ్స్ రచ్చ.. కానీ, ప్రాణాలతో చెలగాటమా?

ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మీమ్స్‌తో దండయాత్ర చేస్తున్నారు. "ఒకప్పుడు ప్రేమలో ఫెయిల్ అయితే గడ్డం పెంచి కవితలు రాసేవారు.. ఇప్పుడు ఏకంగా టవర్లు ఎక్కుతున్నారేంటి సామి!" అని కొందరు, "రోమియో అండ్ జూలియట్ బతికుంటే ఈమెను చూసి సూసైడ్ చేసుకునేవారేమో" అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ సెటైర్లు పక్కన పెడితే.. ప్రేమ పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదం. సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారాలు వెతకాలి కానీ ఇలా వంద అడుగుల టవర్లు ఎక్కి ప్రాణాలను పణంగా పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ప్రస్తుతం పోలీసులు ఈ ‘స్పైడర్ ఉమెన్’ వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నారు. ప్రేమ ఉంటే గుండెల్లో ఉండాలి కానీ.. ఇలా ఊరి మధ్యలో ఉన్న సెల్ టవర్ల మీద కాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.