Begin typing your search above and press return to search.

ముంబై జైలులో చక్కటి సౌకర్యాలు... వజ్రాల వ్యాపారి కోసం సర్వం సిద్ధం!

తనను భారత్ కు అప్పగించడం రాజకీయ ప్రేరితమని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఛోక్సీ ఆరోపించారు.

By:  Raja Ch   |   23 Oct 2025 4:00 PM IST
ముంబై జైలులో చక్కటి సౌకర్యాలు... వజ్రాల వ్యాపారి కోసం సర్వం సిద్ధం!
X

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీ.ఎన్‌.బీ)కు సుమారు 13 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీని భారత్‌ కు అప్పగించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని బెల్జియం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... అతడిని భారత్‌ కు అప్పగించేందుకు ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ సమయంలో ఛోక్సీ అభ్యంతరాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అవును... పీ.ఎన్‌.బీ కు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీని భారత్‌ కు అప్పగించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపింది. అయితే... ఈ అప్పగింత ఆమోదం రాజకీయ ప్రేరితమని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఛోక్సీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై బెల్జియం న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఛోక్సీ అభ్యంతరాలు.. కోర్టు కీలక వ్యాఖ్యలు!:

తనను భారత్ కు అప్పగించడం రాజకీయ ప్రేరితమని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఛోక్సీ ఆరోపించారు. ఇదే సమయంలో.. భారతీయ న్యాయస్థానాల్లో తన కేసు విచారణ సవ్యంగా సాగదని, జుగుప్సాకర జైలు గదిలో రోగాలబారిన పడతానంటూ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ వాదనలు వినిపించారు. అయితే వాటిని బెల్జియం కోర్టు కొట్టేసింది.

ఈ సందర్భంగా... భారత్‌ కు అప్పగించాక కేసు విచారణలో ఎలాంటి అన్యాయం జరగదని, ముంబైలో మీ కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కారాగార సెల్‌ నిర్మించారని కోర్టు వెల్లడించింది. బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నేరస్థుడిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌ కు అప్పగించడం సబబేనంటూ వ్యాఖ్యానించింది!

ముంబై జైలులో చక్కటి సౌకర్యాలు!:

భారత్ లోని జుగుప్సాకర జైలు గదిలో రోగాలబారిన పడతానంటూ ఛోక్సీ చేసిన వాదనకు కౌంటర్ గా.. భారతీయ దర్యాప్తు అధికారులు అందించిన వివరాలను కోర్టు గుర్తుచేసింది. ఇందులో భాగంగా... ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో మిమ్మల్ని ఉంచుతారని.. 12వ నంబర్‌ బ్యారక్‌ లో మీ కోసం ప్రత్యేకంగా రెండు గదులు నిర్మించారని తెలిపింది.

ఇదే సమయంలో ఆ బ్యారక్‌ విస్తీర్ణం ఏకంగా 46 చదరపు మీటర్లుగా ఉందని.. విడిగా మీ కోసం ప్రైవేట్ టాయిలెట్‌ కట్టారని.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు దారాళంగా రావడానికి మూడు పెద్దపెద్ద కిటికీలు పెట్టారని.. పైన ఐదు వెంటిలేటర్లు నిర్మించారని.. మూడు ఫ్యాన్లు, ఆరు పెద్ద ట్యూబ్‌ లైట్లు బిగించారని తెలిపింది.

ఈ సౌకర్యాలు అక్కడితో ఆగిపోలేదు. ఛోక్సీ వార్తలు, ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఛానళ్లు చూసేందుకు ప్రత్యేకంగా కొత్త టీవీ అమర్చారని.. అనారోగ్య సమయంలో ఆస్పత్రికి, కేసు విచారణ సమయంలో కోర్టుకి కాకుండా ఇతర కారణాలతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్లబోరని కోర్టు వ్యాఖ్యానించింది.