తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచే సర్..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఓటర్ల జాబితాలను సవరించనున్నారు. స్పెషల్ ఇంటె న్సివ్ రివిజన్(సర్) పేరిట ఇప్పటికే బీహార్‌లో సవరించారు.
By: Garuda Media | 15 Jan 2026 8:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఓటర్ల జాబితాలను సవరించనున్నారు. స్పెషల్ ఇంటె న్సివ్ రివిజన్(సర్) పేరిట ఇప్పటికే బీహార్‌లో సవరించారు. అప్పట్లో 67 లక్షల మంది ఓటర్లను తొలగిం చారు. ఇది పెను వివాదంగా మారింది. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లింది. ప్రస్తుతం త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా.. 9 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సర్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సర్ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని బూత్ లెవిల్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు. వారితో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల రెండు సార్లు ఆన్‌లైన్ లోనూ చర్చలు జరిపారు. మొత్తంగా ఏప్రిల్ నుంచి మే మధ్య కేవలం 60 రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సర్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీని తీసుకుంటే.. దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 4 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. దీంతో కేవలం 60 రోజుల్లోనే సర్వే చేయగలరా? అనేది ప్రశ్న. అదేసమయంలో పాడేరు, అరకు, విశాఖ వంటి కీలక ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉన్నారు. పైగా సిబ్బంది కొరత వెంటాడుతోంది. మరోవైపు.. మునిసిపల్ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ సజావుగా సాగుతుందా? అనేదిరాజకీయ వర్గాల్లో తలెత్తిన సందేహం.
తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పైగా.. ఇక్కడ బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉండ డంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తమ సర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెబుతోంది. మరోవైపు.. సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెలలో మరోసారి వీటిపై విచారణ జరగనుంది. ఏదేమైనా సర్ ప్రక్రియపై మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీఅనుకూల పార్టీలు స్వాగతిస్తున్నా.. బీజేపీ వ్యతిరేక పార్టీలు మాత్రం విభేదిస్తున్నాయి.
