Begin typing your search above and press return to search.

6న ఏం జరగనుంది? దానం, కడియంపైనే టెన్షన్!

మరోవైపు 8 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని, వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేసినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   4 Feb 2026 11:00 PM IST
6న ఏం జరగనుంది? దానం, కడియంపైనే టెన్షన్!
X

తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఒక వైపు మున్సిపల్ ఎన్నికల సందడితో పార్టీల్లో హడావుడి కనిపిస్తుండగా, పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య టెన్షన్ కు కారణమవుతోంది. సుప్రీం ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను పరిష్కరించారు. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం వెలువడాల్సివుంది. ఆ ఇద్దరిలో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా, స్పీకర్ తీర్పు 19వ తేదీకి వాయిదా వేయడం కూడా ఉత్కంఠకు కారణమవుతోంది.

బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు అసెంబ్లీ స్పీకర్ వద్ద.. అటు సుప్రీంకోర్టులోనూ బీఆర్ఎస్ పోరాడుతోంది. బీఆర్ఎస్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ నాన్చుతున్నారని, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. దీనిపై స్పీకర్ అప్పీలు చేయడంతో ఈ నెల 6వ తేదీ వరకు గడువు పొడిగించింది.

ఇక సుప్రీం గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. దీంతో స్పీకర్ నిర్ణయంపై రాజకీయంగా ఉత్కంఠ ఎక్కువవుతోంది. సుప్రీం ఆదేశాలతో విచారణను వేగవంతం చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, వారి అనర్హతపై దాఖలుచేసిన పిటిషన్లు చెల్లవని తీర్పు వెలువరించారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు. దీంతో మొత్తం 10 మందిలో 8 మంది శాసనసభ్యులు సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మిగిలిన ఇద్దరిపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ఎమ్మెల్యేల్లో ఒకరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయగా, మరొక ఎమ్మెల్యే తన కుమార్తె తరఫున కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నట్లు ఫొటోలు, వీడియోలు చూపినా, స్పీకర్ మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వాదనలనే స్పీకర్ పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయపోరాటం చేయాలని భావిస్తోందని అంటున్నారు.

ఇక 8 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం వెలువడినందున 6వ తేదీన జరిగే విచారణలో సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సివుందని అంటున్నారు. మిగిలిన ఇద్దరి విషయంలో నిర్ణయంపై స్పీకర్ ఏం చెప్పనున్నారు? 19వ తేదీకి దానం నాగేందర్ కేసును వాయిదా వేసినందున మళ్లీ గడువు కోరుతారా? లేక సుప్రీం నిర్ణయం తీసుకోవాలని నివేదిస్తారా? అనే విషయమై చర్చ జరుగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను పరిష్కరించాల్సివున్నప్పటికీ, ఫిర్యాదుదారైన బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి విచారణకు గైర్హాజరు అవడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

మరోవైపు 8 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని, వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నందున నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానం గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక పార్టీ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరఫున పోటీ చేయడానికి వీలు లేదని అంటున్నారు. ఆ విధంగా చేస్తే అనర్హత వేటు వేయొచ్చని చట్టం చెబుతోందని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఎమ్మెల్యే దానంపై నిర్ణయం విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తర్జనభర్జనకు గురవుతున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దానం నాగేందర్ కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు చట్టప్రకారం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే ఈ వాదనలను స్పీకర్ ఎదుట వినిపించలేకపోతున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం దానంపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకపోవడమేనంటున్నారు. దానంపై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం, విచారణకు ఆయన రాకపోవడంతో అనివార్యంగా వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అయితే బీజేపీఎల్పీ నేత వ్యూహాత్మకంగానే విచారణకు గైర్హాజరయ్యారా? దానంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి కీలక సమయంలో ఎందుకు రాలేదు అన్నది చర్చకు దారి తీస్తోంది.

ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విచారణ పూర్తయిన, నిర్ణయం వెలువరించకుండా స్పీకర్ వాయిదా వేశారు. కడియం కుమార్తె గత పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈమెకు మద్దతుగా కడియం ప్రచారం చేసిన వీడియోలు, ఫొటోలను బీఆర్ఎస్ సమర్పించింది. దీంతో వాటిని పరిశీలించి నిర్ణయం వెలువరిస్తానని స్పీకర్ వాయిదా వేశారు. అయితే తన కుమార్తె కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినా, తాను మాత్రం బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నానని కడియం వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన విషయంలో స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలపై ఇంకా అనర్హత వేటు వేలాడుతుండటం, రెండు రోజుల్లో సుప్రీం ఎదుట విచారణ జరగనుండటంతో తెలంగాణ రాజకీయం వాడివేడిగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.