మంచి వక్తగా మంత్రి లోకేష్.. పెరిగిన గ్రాఫ్.. !
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మంచి వక్త అంటూ.. అసెంబ్లీ స్పీకర్ సహా.. అధికారులు కూడా కొనియాడుతున్నారు.
By: Garuda Media | 6 March 2026 7:00 PM ISTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మంచి వక్త అంటూ.. అసెంబ్లీ స్పీకర్ సహా.. అధికారులు కూడా కొనియాడుతున్నారు. ఇదేదో ముఖ స్థుతి కాదని.. ఆయన సభలో వ్యవహరిస్తున్న తీరు.. మంచి ప్రసంగాలు చేయడం వంటివి గమనించే చెబుతున్నామని.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే మీడియా ముందు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా సభలోనూ ఆయన చెప్పుకొచ్చారు. ''గతంలో బూతులు వినలేక ప్రజలు చెవులు మూసుకునే వారు.. ఇప్పుడు అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయి. మంత్రి లోకేష్ చిన్నవాడైనా.. బాగా మాట్లాడుతున్నారు'' అని చెప్పడం గమనార్హం.
మంచి వక్తగా నారా లోకేష్ పరిణితి చెందడం పట్ల సీఎం చంద్రబాబు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పైకి మాత్రం చెప్పడం లేదు. అందుకే.. ఆయనకు మండలిని దాదాపు అప్పగించేశారన్న చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు మండలిలో అడుగు పెట్టలేదు. ఏ కీలక అంశంపై చర్చ జరిగినా.. మంత్రి నారా లోకేష్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనే సమాధానం ఇస్తున్నారు. ఆయనే మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ చేస్తున్న గ్రౌండ్ వర్క్ విషయం మాత్రం సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకునే విషయం కానీ.. సబ్జెక్టుపై ఎక్కడా గాడి తప్పకుండా మాట్లాడడం కానీ.. ఏ అంశంపై అయినా.. వైసీపీకి కౌంటర్లు ఇవ్వడం కానీ.. లోకేష్‌కు మంచి మార్కులు పడేలా చేస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా రెండు కీలక అంశాలపై ప్రస్తుత సభల్లో.. నారా లోకేష్ చేసిన ప్రసంగాలు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కేలా చేస్తున్నాయి.
వీటిలో 1) తిరుమల లడ్డూ వ్యవహారం. 2) పాఠశాల విద్య. ఈ రెండు అంశాలపై కూడా.. లోకేష్ గుక్కతిప్పు కోకుండా వైసీపీని కౌంటర్ చేయడం.. ఎక్కడా తడబాట్లు లేకుండా.. ఆవేశానికి గురి కాకుండా.. మాట్లాడడం .. వాస్తవాలను ఎక్కువగా ప్రస్తావించడం వంటివి లోకేష్‌కు మార్కులు పడే లా చేస్తున్నాయని అంటున్నా రు. అంతేకాదు.. సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు.. వైసీపీ నేతలవైపు కన్నెత్తి చూడకుండా.. వ్యవహరిస్తున్న తీరు కూడా.. సభలో మంచి సంప్రదాయానికి పునాదులు వేస్తున్నారన్న కామెంట్లు వచ్చేలా చేస్తున్నాయి. అందుకే మంచి వక్త అంటూ.. సీనియర్ల నుంచికితాబులు అందుకుంటున్నారు.
