‘రెవెన్యూ మంత్రి గారు మీరే తెలుసుకోండి..’ మంత్రి అనగానికి అయ్యన్నపాత్రుడి షాక్!
విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగానితోపాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.
By: Tupaki Political Desk | 14 Nov 2025 11:00 PM ISTస్పీకర్ అయ్యన్నపాత్రుడు రూటే సెపరేటు. నిర్మొహమాటంగా మాట్లాడటం అయ్యన్నపాత్రుడి స్టైల్ గా చెబుతారు. టీడీపీలో అత్యంత సీనియర్ అయిన అయ్యన్నపాత్రుడు ఇప్పుడు స్పీకర్ పాత్రలో కొత్త పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఆయన చేసే విమర్శలు హాట్ టాపిక్ అవుతుంటాయి. తన, మన అనే భేదం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే అయ్యన్నపాత్రుడు అధికార పార్టీ నేతలను చాలా సార్లు బుక్ చేసేస్తుంటారన్న టాక్ ఉంది. తాజాగా విశాఖ ప్రాపర్టీ షోలో రెవన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు చురకలు అంటించేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగానితోపాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎవరికీ భయపడనని, ఎవరు ఏమనుకున్నా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానని రెవెన్యూ శాఖ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను చాలా ఓపెన్ గా మాట్లాడతానని చెప్పిన అయ్యన్నపాత్రుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయం తెలుసుకోవాలని కూడా చెప్పారు.
‘‘రాష్ట్రంలో అనుమతి లేని లే అవుట్లు వేస్తున్నారు. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత రెవెన్యూ మంత్రిపై ఉంది. ఇది నిజం నేను నిరూపిస్తాను. చెరువుల్లో ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. లే అవుట్ ఎవరి పేరున ఉందో తెలియకుండా అమ్మేస్తున్నారు. అమాయకులు కొనేస్తున్నారు. మోసపోతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.’’ అంటూ స్పీకర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ఆశ. అందరూ విశాఖలో ఇల్లు కట్టుకోవాలని వస్తూ అనుమతిలేని లేఅవుట్లలో మోసపోతున్నారని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) పరిధిలో చాలా అనాథరైజడ్ లేఅవుట్లు ఉన్నాయి. మా నర్సీపట్నంలో 150 ఎకరాలలో అనుమతిలేని లే అవుట్ వేశారు. ఈ విషయాన్ని నేను వుడా దృష్టికి తీసుకువెళితే తెలియదన్నారు. ఆ లేఅవుట్ లో ప్లాట్లు కొన్నవాళ్లు ఏమైపోతారు? అంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెవెన్యూ శాఖ పకడ్బందీగా వ్యవహరించాలని, అనుమతి లేని లే అవుట్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ప్రభుత్వంపైనా స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే ప్రభుత్వం కలకలాం ఉంటుందని అనుకోవద్దు. ఎన్టీఆర్, ఇందిరా గాంధీలనే ఓడించిన జనం మనవాళ్లు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరూ అనుకోవద్దు. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యమని స్పీకర్ హితవు పలికారు. ఇక టూరిజం అభివృద్ధిపైన స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిజంలో గోవా కన్నా విశాఖకు మంచి అవకాశాలు ఉన్నాయన్న అయ్యన్నపాత్రుడు మనం కొన్ని విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. బీచ్ ఒడ్డున టీ తాగడానికి ఎవరూ రారని, భార్య, బిడ్డలతో సంతోషంగా గడపడానికి వస్తారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా క్యాసినో ఆడటానికి గోదావరి జిల్లాల వారు శ్రీలంక వెళ్లిపోతున్నారని, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది గోవా వెళుతున్నారని చెప్పారు. ఇక్కడ డబ్బును అక్కడ ఖర్చు చేస్తున్నారని అన్నారు. టూరిజం అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని అయ్యన్న అభిప్రాయపడ్డారు.
