రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహావిష్కరణ.. పృథ్వీరాజ్ స్పందన ఇదీ
గాన గంధర్వుడు, దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రాంగణంలో సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.
By: A.N.Kumar | 15 Dec 2025 11:06 PM ISTగాన గంధర్వుడు, దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రాంగణంలో సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. 7.2 అడుగుల ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లాలో తయారు చేయించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచంద్రరావు తదితర ప్రముఖులు హాజరై బాలసుబ్రహ్మణ్యంకు ఘనంగా నివాళులర్పించారు.
పరిపూర్ణ కళాకారుడు
విగ్రహావిష్కరణ అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గొప్ప గాయకుడే కాదని.. ఆయనో స్నేహశీలి, మృదుస్వభావి అని కొనియాడారు. ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుడిని గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారు. సినీ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఎస్పీబీ గళాన్ని అక్షయ పాత్రతో పోల్చిన వెంకయ్య ‘ఎస్పీ గళం.. సంగీత దర్శకుడు ఏది కోరుకుంటుందో అది ఇచ్చే అక్షయపాత్ర’ అని ప్రశంసించాడు. గళంలో వైవిధ్యం చూపడం ఆయన ప్రత్యేకత అని.. ఆయన తెలుగు ఉచ్ఛరణ ఎంతో ఆనందాన్నిచ్చేదని గుర్తు చేసుకున్నారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా వందలమంది కొత్త గాయకులను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.
ఘంటసాల తర్వాత బాలు : దత్తాత్రేయ
హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు తెలుగు ప్రజలందరికీ గౌరవం అని కొనియాడారు. ఎస్పీ బాలు గాయకుడే కాకుండా సంగీత దర్శకుడు, నటుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారని అన్నారు. పలు భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి , ఘంటసాల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు అని కొనియాడారు. ముఖ్యంగా ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘శంకరా’ పాట తన మనసుకు హత్తుకుందని.. అలాగే దేశభక్తిని చాటే ‘ఫుణ్యభూమి నాదేశం’, ‘అదిగో అల్లదిగో శ్రీహరివాసం’ వంటి గీతాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
50 మందితో సంగీత విభావరి
విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్రభారతిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో ఇవాళ సాయంత్రం 50 మందితో కూడిన సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది తెలుగు సంగీత అభిమానులను అలరించనుంది.
విగ్రహాన్ని ఎన్ని రోజులు పోలీసులు కాపాడుతారు : ఫృథ్వీరాజ్
తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా చెప్పుకుంటున్న సంగంరెడ్డి ఫృథ్వీరాజ్ ఈ సందర్భంగా బాలు విగ్రహా ఏర్పాటుపై మండిపడ్డారు. ఆంధ్రా వాళ్లను తీసుకొచ్చి తెలంగాణ గుండెలపై మోపుతున్నారు. ఆంధ్రా నేతలపేర్లు ఆ ప్రాంతంలో లేదు. తెలంగాణలో ఎందుకు పెడుతున్నారు. వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఏంటి.. పరాయి పాలనలో ఇంకా బానిసత్వపు పాలననేనా? అంటూ ఫృథ్వీరాజ్ మండిపడ్డారు. ‘విగ్రహాన్ని ఎన్నిరోజులు పోలీసులు కాపడతారో చూస్తాం.. దాన్ని తొలగిస్తాం’ అంటూ సవాల్ చేశారు. తెలంగాణ కళాకారులు, పెద్దమనుషులు, నేతలను పట్టించుకోకుండా.. ఆంద్రా వాళ్లను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడం ఏంటని ఫృథ్వీరాజ్ మండిపడ్డారు.
