Begin typing your search above and press return to search.

స్పెయిన్ సరిహద్దుకు వేలాది వలసదారులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం.. స్పందించిన వైట్ హౌస్

ఉత్తర ఆఫ్రికా పైనున్న స్పెయిన్‌కు చెందిన సెఉటా సరిహద్దు వద్ద ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

By:  A.N.Kumar   |   31 July 2026 2:21 PM IST
స్పెయిన్ సరిహద్దుకు వేలాది వలసదారులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం.. స్పందించిన వైట్ హౌస్
X

ఉత్తర ఆఫ్రికా పైనున్న స్పెయిన్‌కు చెందిన సెఉటా సరిహద్దు వద్ద ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆఫ్రికాలోని మొరాకో వైపు నుంచి వేలాది మంది వలసదారులు ఏకకాలంలో సరిహద్దులను దాటుకుని స్పెయిన్‌లోకి ప్రవేశించేందుకు యత్నించడంతో అక్కడ తీవ్ర అలజడి చెలరేగింది. సముద్ర మార్గంలో ఈదుకుంటూ ట్యూబ్‌ల సహాయంతో సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు భూసరిహద్దు వద్ద ఉన్న గేట్లను నెట్టుకుంటూ లోపలికి పరుగులు తీశారు. ఈ అపూర్వమైన చొరబాట్లతో ఆందోళన చెందిన స్పెయిన్ ప్రభుత్వం వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసులతో పాటు సైనిక బలగాలను రంగంలోకి దించింది.

సెఉటా, మెలిల్లా ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్విగ్న పరిస్థితులు

స్పెయిన్ ప్రభుత్వ టెలివిజన్ టీవీఈ కథనం ప్రకారం.. ఒక్క రోజు వ్యవధిలోనే సుమారు 2,000 నుంచి 3,000 మంది వలసదారులు సెఉటాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, స్థానిక ప్రత్యక్ష సాక్షుల కథనాలు అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. మొరాకో వైపు ఉన్న ఫ్నిడెక్ ప్రాంతంలో వలసదారుల గుంపును చెదరగొట్టేందుకు అక్కడి భద్రతా బలగాలు వాటర్ కానన్లను ఉపయోగించాయి. స్పెయిన్‌కు చెందిన మరొక ఉత్తర ఆఫ్రికా ప్రాంతమైన మెలిల్లా సరిహద్దులో కూడా వలసదారులు చొరబడేందుకు యత్నించడంతో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి.

మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఘర్షణల్లో వలసదారులతో పాటు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గత కొన్ని నెలలుగా సముద్ర మార్గంలో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నాల్లో 60 మందికి పైగా వలసదారులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో తొమ్మిది మృతదేహాలు లభించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రధాని పర్యటన.. సైన్యం రంగప్రవేశం

ఈ సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించిన స్పెయిన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. పరిస్థితిని సమర్థవంతంగా అదుపు చేయడానికి ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు సుమారు 60 మంది సైనికులను అత్యవసరంగా సెఉటాకు పంపించింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాందో గ్రాండే-మార్లాస్కాతో కలసి సెఉటాను స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు ప్రకటించారు.

రాజకీయ దుమారం.. వైట్ హౌస్ స్పందన

ఇటీవల స్పెయిన్ ప్రభుత్వం సరైన పత్రాలు లేని సుమారు 5 లక్షల మంది వలసదారులకు చట్టబద్ధ హోదా కల్పించేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే వలసదారులను మరింత ప్రోత్సహిస్తోందని అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ నాయకుడు అల్బెర్టో నునెజ్ ఫెయిజో ఈ ఘటనను ఏకంగా "జాతీయ భద్రతా సంక్షోభం"గా అభివర్ణించారు.

ఈ పరిణామంపై అంతర్జాతీయంగా కూడా చర్చ నడుస్తోంది. అమెరికా వైట్ హౌస్ ఈ ఘటనపై స్పందిస్తూ.. యూరప్‌లో గ్లోబలిస్ట్, అతివామపక్ష వలస విధానాలు కొనసాగితే ఇలాంటి సంక్షోభాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా హెచ్చరిస్తున్నారని గుర్తు చేసింది. ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ హెచ్చరికలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది.

చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం: స్పెయిన్ ప్రభుత్వం

ఈ విమర్శలపై స్పెయిన్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ భారీ వలసల వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. అక్రమంగా సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన వారిని చట్టప్రకారం వారి సొంత ప్రాంతాలకు తిరిగి పంపిస్తామని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో భద్రతను పునరుద్ధరించడానికి.. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు మొరాకో ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.