బాలు విగ్రహం: కొన్ని వివాదాలు.. ఏది నిజం?
అసలు విషయానికి వస్తే.. ప్రముఖ రచయిత అందెశ్రీ రచించిన తెలంగాణ గీతం.. `జయ జయహే తెలం గాణ జననీ జయకేతనం` అనే పల్లవితో సాగుతున్న నేపథ్యం అందరికీ తెలిసిందే.
By: Garuda Media | 15 Dec 2025 4:45 PM ISTగానగంధర్వుడు... తెలుగు వారి మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యవహారం.. తెలంగాణలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశం అయింది. కరోనా నేపథ్యంలో ఆయన మృతి చెందిన తర్వాత.. తొలిసారి ఆయన వ్యవహారం ఇటు రాజకీయంగా.. అటు సాహిత్య పరంగా కూడా వివాదానికి దారితీసింది. దీనికి కారణం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే.
ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దంటూ.. తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పార్టీల నాయకులు.. కూడా డిమాండ్ చేస్తున్నారు. జాగృతి నాయకురాలు.. కవిత సహా పలు తెలంగాణ విద్యార్థి సంఘాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళన కారులను ముందస్తుగానే అరెస్టు చేశారు. మరికొందరు ప్రముఖులను గృహ నిర్బంధం చేశారు. వారు బయటకు రాకుండా.. పోలీసులు కాపలా పెట్టారు.
అయితే.. అసలు వివాదం ఏంటి?
అసలు విషయానికి వస్తే.. ప్రముఖ రచయిత అందెశ్రీ రచించిన తెలంగాణ గీతం.. `జయ జయహే తెలం గాణ జననీ జయకేతనం` అనే పల్లవితో సాగుతున్న నేపథ్యం అందరికీ తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని అధికారిక గీతంగా కూడా గుర్తించింది. అయితే. ఇది ఇప్పటి గీతం కాదు.. కేసీఆర్ హయాంలోనే రూపు దిద్దుకున్న గీతం. కానీ.. అప్పట్లో గుర్తింపునకు నోచుకోలేదు. ఇదిలావుంటే.. అప్పట్లో.. ఈ గీతాన్ని ఆలపించాలని అందెశ్రీ.. బాలును కోరారు.
దీనికి ఆయన అంగీకరించారు. అయితే.. గీతం మొత్తంలో చివరన `స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి` అనే లైన్ ఉంది. ఈ లైన్‌ను మార్చాలని.. లేకపోతే తాను పాడనని బాలు తెగేసి చెప్పారు. దీనికి కారణం ఏంటనేది తెలియదు. అయితే.. అందెశ్రీ దీనికి అంగీకరించలేదు. మొత్తంగా ఇది వివాదంగా మారింది. తర్వాత కాలంలో కేసీఆర్ జోక్యం చేసుకుని ఈ గీతంలో అనేక మార్పులు చేశారు. అనంతరం.. బాలుతో పాడించాలని అనుకున్నారు. కానీ, ఆయన మృతి చెందారు. సో.. ఇదీ వాస్తవ వివాదం.
కానీ, కొందరు.. అసలు బాలసుబ్రహ్మణ్యం ఈ గీతాన్ని పాడనని చెప్పారని.. అందుకే అందెశ్రీ గొడవ పడ్డారని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు తెలంగాణకు బాలు వ్యతిరేకమని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఇది వివాదంగా మారింది. అయినా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపడం గమనార్హం.
