Begin typing your search above and press return to search.

శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్.. భారత్ చుట్టూ అగ్రరాజ్యాల కుట్ర?

ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితి కూడా అలానే ఉంది. పార్లమెంట్ భవనం దగ్ధమవ్వడం, ప్రభుత్వ ఆస్తులు నాశనం కావడం, సైన్యం నియంత్రణలోకి వచ్చినా అల్లర్లు ఆగకపోవడం.

By:  A.N.Kumar   |   10 Sept 2025 9:28 AM IST
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్.. భారత్ చుట్టూ అగ్రరాజ్యాల కుట్ర?
X

ఇటీవలి సంవత్సరాల్లో దక్షిణాసియాలో ఒక ఆందోళనకర దృశ్యం వెలిసింది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్.. మూడు దేశాలు మూడు వేర్వేరు సందర్భాల్లో ఆందోళనల తాకిడికి తలొగ్గాయి. ఒక్కో ఉద్యమం ఒక్కో రూపంలో ప్రారంభమై చివరకు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తూ, రాజకీయ వ్యవస్థలను కుదేలు చేస్తూ ముందుకు సాగాయి. ఇవి సహజసిద్ధంగానే జరిగాయా? లేక అగ్రరాజ్యాల గూఢచర్య వ్యూహాల ఫలితమా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వెతికే అవసరం ఉంది.

శ్రీలంకలో జరిగిన ఆందోళనలతోనే ఈ శ్రేణి ప్రారంభమైంది. కుటుంబ పాలన, అవినీతి వంటి సమస్యలే కారణమని అంతర్జాతీయ మీడియా ఆరాటపడింది. కానీ ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు మరో దిశలో చూపించాయి. అమెరికాకు అనుకూల ప్రభుత్వం ఏర్పడి, వనరులపై ఆ దేశం ఆధిపత్యం పెరగడం యాదృచ్ఛికం కాదు.

దీని తరువాత బంగ్లాదేశ్. అమెరికా వ్యతిరేక వైఖరి కనబరచిన ప్రధానమంత్రి షేక్ హసీనా ఆందోళనల దెబ్బకు పదవి కోల్పోవడం, దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రావడం.. ఇది కూడా కేవలం ప్రజా ఉద్యమం ఫలితమని చెప్పడం కష్టం. ఉద్యమాల వెనుక అంతర్జాతీయ ఆటతీరు స్పష్టంగా కనిపించింది.

ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితి కూడా అలానే ఉంది. పార్లమెంట్ భవనం దగ్ధమవ్వడం, ప్రభుత్వ ఆస్తులు నాశనం కావడం, సైన్యం నియంత్రణలోకి వచ్చినా అల్లర్లు ఆగకపోవడం.. ఇవి అన్నీ ఒక దేశాన్ని బలహీనపరిచే ప్రణాళికలుగానే అనిపిస్తున్నాయి.

ఈ క్రమాన్ని గమనిస్తే.. దక్షిణాసియాలో అమెరికా–చైనా వ్యూహపోరు ప్రధాన కారణమని అనిపిస్తుంది. అమెరికా తనకు అనుకూల ప్రభుత్వాలను కూర్చబెట్టుకోవాలని, చైనా భారతదేశాన్ని చుట్టుముట్టి బలహీనపరచాలని ప్రయత్నిస్తోంది. ఈ పోటీ వల్ల చిన్న దేశాలు బలహీనమవుతుండటం, ఆర్థికంగా దెబ్బతినడం అనివార్యం.

కానీ ప్రశ్న ఏమిటంటే.. మన దేశం సురక్షితమా? రైతు ఉద్యమం రూపంలో గతంలో ప్రయత్నాలు జరిగాయి. సీఏఏ ఆందోళనలు సాగాయి. భవిష్యత్తులో మరో రూపంలో తిరిగి రాకుండా ఎవరూ హామీ ఇవ్వలేరు. పుకార్లకు, మాయాజాలాలకు, అవాంఛిత ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

మొత్తానికి చుట్టుపక్కల రగులుతున్న నిప్పులు మనకూ తాకే ప్రమాదం ఉంది. దానిని ఆపేది అవగాహన, అప్రమత్తత, దృఢనాయకత్వమే.