షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని సోనియా స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి షర్మిలకు అందించారు. ఈ పుస్తకాన్ని ఆమె చేతుల మీదుగా అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని షర్మిల సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.
By: Satya P | 11 Nov 2026 10:15 PM ISTకాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ అయిన సోనియా గాంధీ ఆత్మ కధ బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకాన్ని స్వయంగా సోనియా గాంధీ షర్మిలకు అందించారు. దీంతో షర్మిల ఎంతగానో సంతోషించారు. సోనియాగాంధీ చేతుల మీదుగా ఆమె రాసిన ఆత్మకథ పుస్తకం అందుకోవడం గొప్ప గౌరవం అని షర్మిల వ్యాఖ్యానించారు. పైగా సోనియాగాంధీ ఆటోగ్రాఫ్ చేసి తనకు ఈ పుస్తకం ఇచ్చారు అని ఆమె సోషల్ మీడియా పోస్టులో దానిని పెట్టి మరీ ఆనందం వ్యక్తం చేశారు.
తరాలు ప్రేరేపించిన నేత :
ఇక సోనియాగాంధీని షర్మిల గొప్పగా కీర్తించారు. ఆమె తరతరాలను ప్రేరేపించిన ఒక నాయకురాలి నుంచి తాను పొందిన ఒక ఆత్మీయ స్పర్శ అని కూడా అభివర్ణించారు. ఇక పుస్తకంలో సోనియాగాంధీ వ్యక్తిగత ఆలోచనలను చదవడానికి అనుభవాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా తాను ఎదురుచూస్తున్నట్లుగా షర్మిల ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తన కూతురు అంజలి రెడ్డి వివాహ పత్రికను సోనియాకు షర్మిల దంపతులు అందజేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీని కలిసి కూడా షర్మిల పెళ్ళికి ఆహ్వానించారు.
వైఎస్ తరువాత :
ఇదిలా ఉంటే వైఎస్సార్ తరువాత సోనియా గాంధీ అభిమానం పొందిన నేతతో షర్మిల నిలుస్తున్నారు అని అంటున్నారు. వైఎస్సార్ కి సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలోకి వచ్చిన తరువాతనే ఉమ్మడి ఏపీలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఆయన పీసీసీ చీఫ్ అయినా సీఎల్పీ లీడర్ అయినా రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా సోనియాగాంధీ అభిమానం ఉందని అంటారు. అంతకు ముందు రాజీవ్ గాంధీ కూడా వైఎస్సార్ ని ప్రోత్సహించారు. ఒక విధంగా ఏపీలో వైఎస్సార్ ఫ్యామిలీని అన్ని విధాలుగా దగ్గరకు తీసింది రాజీవ్ సోనియాగాంధీలే అని అంటారు.
అందుకే ఆమె :
ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ఏమి సాధించారు, పార్టీని ఏమి పటిష్టం చేశారు అని అంతా అంటారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం వైఎస్సార్ తనయగా ఆమెకు ప్రాధాన్యత ఇస్తూనే ఈ పదవిలో ఉంచుతున్నారని చెబుతున్నారు. వైఎస్సార్ రక్తం అని కూడా ఆమె మీద ప్రత్యేక అభిమానం చూపుతున్నారని కూడా చెబుతారు. ఇక జాతీయ స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. 2029లో ఇండియా కూటమి కనుక గెలిచి రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయితే ఏపీలో షర్మిల రాజకీయ దశ కూడా తిరుగుతుందని విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం మీద షర్మిల గాంధీ కుటుంబానికి చేరువ కావడమే కాదు వారి అభిమానం పొందారని అంటున్నారు.
