నాలుగు సార్లు విజేతగా సోనియా... రాహుల్ చెప్పిన నిజం
సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో క్యాన్సర్‌తో చేసిన పోరాటం గురించి తొలిసారిగా వెల్లడించారు. 2010లో రొమ్ము క్యాన్సర్‌కు ఇటలీలో, 2011లో క్లోమం వద్ద కణితికి నెదర్లాండ్స్‌లో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అయితే తన తల్లి నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. అనారోగ్య సమయంలోనూ ఆమె ఎప్పుడూ భయపడలేదని, ధైర్యం కోల్పోలేదని ప్రశంసించారు.
By: Satya P | 18 Nov 2026 8:16 AM ISTకాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ రాసిన ఆత్మ కధలో చాలా విషయాలు చెప్పారు. అందులో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలను నష్టాలను కూడా చెప్పుకొచ్చారు. అయితే సోనియా ఈ కష్టాలు ఎదుర్కొనే సమయంలో ఆమె వయసు రీత్యా తక్కువగానే ఉన్నారు. ఆమెకు ఆ విధంగా గట్టి పరచుకుని ముందుకు సాగారు. అయితే సోనియా మలి దశలో ఉన్నపుడు మాత్రం ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నిజంగా అదే అసలైన పోరాటం అని అంటున్నారు. ఆమె వయసు మళ్ళిన తరువాత ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు ఆ సమయంలో ఆమె చూపించిన నిబ్బరం ఇదే ఆమె ఆత్మ కధ నుంచి తీసుకోవాల్సిన అసలైన స్పూర్తి అని అంటున్న వారూ ఉన్నారు.
ఆ పోరాటం గొప్పది :
సోనియా గాంధీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కీలక దశ కూడా ఇదే అని పుస్తకంలో రాసిన దాని ప్రకారం చూస్తే అర్ధం అవుతోంది. ఆమె అనారోగ్యంతో తీవ్ర స్థాయిలో పోరాడారు. ఆమె క్యాన్సర్ వంటి అతి భయంకరమైన వ్యాధితో పోరాడారు. ఎక్కడా ధైర్యం తగ్గలేదు, మనో నిబ్బరం చెదరలేదు, అంతే కాదు ఆమె ఏ రోజు డీలా పడలేదు. చివరికి అలా సాగించిన వీరోచిత పోరాటంలో సోనియా గాంధీ విజేత అయ్యారు. ఇటీవల విడుదలైన తన ఆత్మకథలో సోనియా గాంధీ యూపీఏ రెండో విడత పాలనా కాలంలో ఎదుర్కొన్న రెండు ప్రధాన క్యాన్సర్ చికిత్సల గురించి తొలిసారిగా రాశారు. వ్యక్తిగత గోప్యత కోసం మీడియా హడావుడికి దూరంగా ఉండటానికి ఆమె విదేశాల్లో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. 2010లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ఇటలీలోని మిలన్ సమీపంలో ఉన్న యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ మరుసటి ఏడాది 2011లో సాధారణ వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్ (క్లోమం) వద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. దీని కోసం నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌లో ఉన్న ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ఆమెకు ఆపరేషన్ జరిగింది.
రాహుల్ చెప్పిన విషయం :
ఇదిలా ఉంటే తన తల్లి సోనియా గాంధీ నాలుగు సార్లు క్యాన్సర్‌తో పోరాడి గెలిచారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తన తల్లి పుస్తకంలో కేవలం రెండు సార్లు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి రాశారని కానీ వాస్తవానికి ఆమె నాలుగు సార్లు క్యాన్సర్‌ను జయించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆమె తన అనారోగ్య సమస్యలను ఎప్పుడూ తక్కువ చేసి చూపేవారని, ఏనాడూ భయపడలేదని వెనకడుగు వేయలేదని ఆయన ప్రశంసించారు. ఇన్ని కష్టాలు ఎదురైనా ఆమె ఎప్పుడూ భయపడటం వెనకడుగు వేయడం తాను చూడలేదని అన్నారు. ఇది కదా అసలైన మనో నిబ్బరం అని ఆయన అంటూ తన తండ్రి రాజీవ్ గాంధీ జీవించి ఉంటే అమ్మ ధైర్యాన్ని చూసి ఎంతగానో మెచ్చుకునే వారు అని రాహుల్ భావోద్వేగం చెందారు.
