Begin typing your search above and press return to search.

రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !

2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు విషయంలో తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు సోనియా గాంధీ తన ఆత్మకథలో వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన ఎల్టీటీఈకి డీఎంకే మద్దతు ఉందని, ఆ పార్టీతో చేతులు కలపడం రాజీవ్‌కు ద్రోహం చేసినట్లా అని ప్రశ్నించుకున్నానని తెలిపారు. అయితే బీజేపీని ఓడించేందుకు పొత్తుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

By:  Satya P   |   12 Nov 2026 7:46 AM IST
రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !
X

రాజీవ్ గాంధీ సోనియా గాంధీలది ఎంతటి ప్రేమ బంధం అన్నది అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె రాసిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకంలో రాజీవ్ గురించి రాసిన విషయాలు అన్నీ చూస్తే ఆ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అలాంటి రాజీవ్ గాంధీతో సోనియా గాంధీ వివాహ బంధం కేవలం 23 ఏళ్ళు మాత్రమే. 1968 లో వీరి పెళ్లి అయితే 1991లో రాజీవ్ హత్య కావించబడ్డారు ఆయన లేకుండా ఇప్పటికి 36 ఏళ్ళుగా కాలం సోనియా గడుపుతున్నారు. అయితే రాజీవ్ గాంధీ బాటలో ఆమె నడుస్తూ కాంగ్రెస్ పార్టీని దేశంలో రెండు సార్లు అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇపుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ మరోసారి కాంగ్రెస్ ని దేశంలో అధికార పీఠం మీద కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సోనియా గాంధీ గురించి ఇప్పటిదాకా వచ్చిన వార్తల నుంచి విన్నవి మాత్రమే జనాలకు తెలుసు. అసలు తాను ఏమిటి అన్నది ఆమె తన తాజా ఆత్మ కధలో సవివరంగా తెలియచేశారు అని అంటున్నారు.

రాజీవ్ నుంచి రాజకీయం దాకా :

ఈ పుస్తకంలో రాజీవ్ తో ప్రేమ నుంచి మొదలుపెడితే రాజకీయాల దాకా తన సుదీర్ఘమైన ప్రయాణం ఆరు దశాబ్దాల కాలాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించారు. అందులో ఎందరో నేతల గురించి ఉంది. దిగ్గజ నేతల గురించి కూడా ఉంది. బీజేపీ నేతల గురించి ఆర్ఎస్ఎస్ గురించి తన అభిప్రాయాలను సోనియా గాంధీ నిర్మొహమాటంగా వివరించారు. ఈ క్రమంలో ఆమె తాను కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో తనకు ఎదురైన ఎన్నో అనుభవాలను కూడా ప్రస్తావించారు. కఠిన పరీక్షలు సవాళ్ళు కూడా ఆమె రాసి ఉంచారు. అలాంటి వాటిలో ఒకటి దక్షిణాదిన ఒక కీలక రాజకీయ పార్టీ గురించిన అతి ముఖ్య ప్రస్తావన. ఆ పార్టీ పేరే డీఎంకే. ఈ రోజున ఇండియా కూటమికి కాంగ్రెస్ పొత్తుకు దూరమై ఉన్న డీఎంకే కాంగ్రెస్ రెండు దశాబ్దాలకు పైగా పొత్తు బంధం నెరిపాయి. మరి తొలిసారి ఈ పొత్తు ఎలా కలిసింది అన్నదే చర్చ. దానికి సోనియా గాంధీ తన పుస్తకంలో ఎన్నో విషయాలను వివరించారు.

క్లిష్ట పరిస్థితుల మధ్య :

ఇక చూస్తే సరిగ్గా 2004 ఎన్నికల సమయం. అప్పటికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ అయితే 1996 తరువాత మళ్ళీ గెలవని నేపథ్యం ఉంది. దాంతో అన్ని శక్తులూ కూడదీసుకుని కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో తలపడాల్సి ఉంది. అప్పటికి సోనియా గాంధీ అధ్యక్షతన రెండు దఫాలు కాంగ్రెస్ పోరాడి బీజేపీ చేతిలో ఓటమి పాలు అయింది. ఈసారి గెలవకపోతే ఎలా అన్న చర్చ. దాంతో కొత్త మిత్రులను సంపాదించి ఎన్డీయే కూటమికి ధీటుగా యూపీయే కూటమిని కాంగ్రెస్ తయారు చేస్తోంది. ఆ సమయంలో తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీతో ఉంది. డీఎంకే మరో పార్టీగా ఉంది.

రాజీవ్ కూడా అలాగే :

దాంతో 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే తో పొత్తు విషయంలో తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు సోనియా గాంధీ తన ఆత్మకథలో వెల్లడించారు. రాజీవ్ గాంధీని చంపిన ఎల్టీటీఈ టెర్రరిస్ట్ గ్రూప్ నకు డీఎంకే మద్దతు ఉంది. అందుకే వారితో పొత్తు పెట్టుకుంటే రాజీవ్‌కు ద్రోహం చేసినట్లు కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా అని సోనియా గాంధీ ఆ పుస్తకంలో రాశారు. అయితే అదే సమయంలో మరో ఆలోచన కూడా చేశాను అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పొత్తు అవసరమైతే బహుశా రాజీవ్ కూడా ఇలాగే చేసేవారేమో అని అనుకున్నానని ఆమె సర్దిచెప్పుకొని డీఎంకేతో పొత్తుకు పచ్చ జెండా ఊపారు. అలా ఆ పొత్తు తనకు ఎంతో పరీక్షపెట్టిందని సోనియా తన ఆత్మ కధలో పేర్కొన్నారు. చిత్రమేంటి అంటే ఈ రోజున డీఎంకే కాంగ్రెస్ కి దూరంగా ఉండడం. మళ్లీ ఈ పొత్తు పొడుస్తుందా అంటే కాలమే జవాబు చెప్పాల్సింది.