సోనియా ఆత్మకథ: జనాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!
సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకానికి తొలిరోజే భారీ స్పందన లభించింది. హైదరాబాద్‌లో వెయ్యి కాపీలు రాగా, గంటలోనే 150 పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఢిల్లీలోని ఓ బుక్‌స్టోర్‌లో రెండు గంటల్లో 300 కాపీలు విక్రయమయ్యాయి. అమెజాన్, బ్లింకిట్‌లోనూ అమ్మకాలు మొదలయ్యాయి.
By: Garuda Media | 12 Nov 2026 12:00 AM ISTకాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ స్వయంగా రాసుకున్న ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ భారీ ప్రజాదరణను చూరగొందని జాతీయ మీడియా పేర్కొంది. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని తెలిపింది. అయితే.. మెట్రో సిటీల్లో మాత్రమే ప్రస్తుతం ఇవి అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. పుస్తకం మార్కెట్లోకి వచ్చి కేవలం ఒక రోజు మాత్రమే కావడంతో దేశవ్యాప్తంగా ఇవి అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని పబ్లిషర్ పేర్కొన్నట్టు వార్తా కథనాలు ఉటంకించాయి.
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ సోనియా రాసిన ఆత్మకథను ముద్రించింది. మొదటి దశలో ఒక లక్ష కాపీలను ముద్రించింది. భారత్‌లో హార్పర్ కాలిన్స్ దీనిని ప్రచురించి పంపిణీ హక్కులు కూడా కొనుగోలు చేసింది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ఉన్న బహ్రిసన్స్ బుక్‌స్టోర్‌కు తొలి రోజు వెయ్యి కాపీలు రాగా, రెండు గంటల సమయంలోనే సుమారు 300 కాపీలు అమ్ముడయ్యాయి. అదే ప్రాంతంలోని ఫకీర్ చంద్ బుక్ స్టోర్‌లో తొలిరోజు 150 నుండి 200 కాపీల వరకు విక్రయాలు జరిగాయి.
హైదరాబాద్‌కు తొలిరోజు వెయ్యి కాపీలు రాగా, ఇండియా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక్క గంటలోనే 150 పుస్తకాలు విక్రయించింది.నగరంలోని ప్రముఖ బుక్ స్టోర్లలో స్టాక్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే కాపీలు అమ్ముడవడం మొదలైందని వ్యాపారులు తెలిపారు. ఈ పుస్తకం విడుదలైన వెంటనే అమేజాన్, బ్లింకిట్ వంటి ఈ కామర్స్ సంస్థలు కూడా ఆన్‌లైన్ విక్రయాలను ప్రారంభించాయి. 'బయోగ్రఫీస్ - ఆటోబయోగ్రఫీస్' విభాగంలో బెస్ట్ సెల్లర్ జాబితాలోకి సోనియా పుస్తకం చేరింది. అదనంగా, క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ 34% డిస్కౌంట్‌తో నిమిషాల్లోనే ఈ పుస్తకాన్ని డెలివరీ చేస్తోంది. ప్రస్తుతం 250 కాపీలను విక్రయించినట్టు పేర్కొంది.
పాఠకుల ఆసక్తి ఎలా ఉంది?
ప్రముఖ పుస్తక విక్రేతలు, విశ్లేషకులు సోనియా ఆత్మకథను.. "దశాబ్దంలోనే అతిపెద్ద పుస్తక విడుదల"గా అభివర్ణిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పుస్తకాలకు లభించిన స్థాయిలో సోనియా పుస్తకానికి కూడా ఆదరణ కనిపిస్తోందని చెప్పడం గమనార్హం.
వివాదాలపైనే ఆసక్తి!
దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ సోనియా గాంధీ మీడియాకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బహిరంగంగా పంచుకోలేదు. తొలిసారిగా ఆమె స్వయంగా తన జీవితంలోని ప్రేమ, పెళ్లి, ఇందిర, రాజీవ్ గాంధీల మరణాలు, అలాగే 2004లో ప్రధాని పదవిని వదులుకోవడం వంటి కీలక ఘట్టాలను ఇందులో వివరించడం పాఠకులలో తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించింది. అంతేకాదు.. ప్రణబ్ ముఖర్జీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌లపై చేసిన వ్యాఖ్యలు కూడా పాఠకులను ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది.
