Begin typing your search above and press return to search.

దేశంలో రెండో స్వాతంత్ర స‌మ‌రం త‌ప్ప‌దు: సోన‌మ్‌

దేశంలో రెండో స్వాతంత్ర స‌మ‌రం త‌ప్ప‌ద‌ని.. ప్ర‌జ‌లంతా క‌లిసి రావాల‌ని ప్ర‌ముఖ విద్యావేత్త, సామాజిక ఉద్య‌మ కారుడు సోన‌మ్ వాంగ్ చుక్ పిలుపునిచ్చారు.

By:  Garuda Media   |   20 July 2026 10:10 AM IST
దేశంలో రెండో స్వాతంత్ర స‌మ‌రం త‌ప్ప‌దు: సోన‌మ్‌
X

దేశంలో రెండో స్వాతంత్ర స‌మ‌రం త‌ప్ప‌ద‌ని.. ప్ర‌జ‌లంతా క‌లిసి రావాల‌ని ప్ర‌ముఖ విద్యావేత్త, సామాజిక ఉద్య‌మ కారుడు సోన‌మ్ వాంగ్ చుక్ పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ఢిల్లీలోని సఫ్ద‌ర్ జంగ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వాంగ్ చుక్‌.. ఆసుప‌త్రి బెడ్ మీద నుంచే ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి బ‌హిరంగ లేఖ రాశారు. ఈ మేర‌కు ఆయ‌న స‌తీమ‌ణి గీతాంజ‌లి.. స‌ద‌రు లేఖ‌ను మీడియాకు విడుద‌ల చేశారు. దేశంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. భావ‌ప్ర‌క‌ట‌న బంధీ అయింద‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో ఇంకా నిర్ల‌క్ష్యంగా ఉంటే.. జీవితాల‌కే ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌న్నారు.

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కేకు ఆది నుంచి మ‌ద్ద‌తుగా నిలిచిన సోన‌మ్‌.. గ‌తంలో ల‌డ్ధ‌క్ ప్రాంతంలో స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, బాలికా విద్య కోసం నిరంత‌రం ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాల‌కు కూడా ఆయ‌న పిలుపుని చ్చారు. ఆ త‌ర్వాత‌.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తుగానిలిచారు. ఆ పార్టీ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టించారు. నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ.. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా కు ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే గ‌త నెల 20వ తేదీ నుంచి శ‌నివారం వ‌ర‌కు ఆయ‌న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు.

ఈ వ్య‌వ‌హారంపై ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని సోన‌మ్ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే బాధ్యత ప్ర‌భుత్వానిదేన‌ని తేల్చి చెప్పింది. దీంతో శ‌నివారం తెల్ల‌వారుజామున ఢిల్లీ పోలీసులు ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆసుప‌త్రిలోనూ సోన‌మ్ త‌న దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. త‌న‌కు ఎలాంటి ఫ్లూయిడ్స్ ఎక్కించ‌వ‌ద్ద‌ని వైద్యుల‌కు ఆయ‌న విన్న‌వించారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సోన‌మ్ బ‌హిరంగ లేఖ రాశారు. ప్ర‌జ‌లంతా జాగ‌రూకులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. స‌మ‌యం కూడా ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

లేఖ సారాంశం ఇదీ...

సోన‌మ్ త‌న లేఖలో.. రెండో స్వాతంత్ర స‌మ‌రానికి ప్ర‌జ‌లంతా సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో ఒక భ‌యాన‌క‌, భ‌యో త్పాత ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని, వీటి నుంచి విముక్తి కావాలంటే.. రెండో స్వాతంత్ర ఉద్య‌మం అవ‌స‌రమ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. సోమ‌వారం నిర్వ‌హించే పార్ల‌మెంటు ముట్ట‌డి కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా ఏక‌మై పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీని అరిక‌ట్ట‌డంతోపాటు భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను కాపాడుకునేందుకు, బాధ్య‌తాయుత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకు నేందుకు ప్ర‌జ‌లు న‌డుం బిగించాల‌న్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం నాటి పార్ల‌మెంటు ముట్ట‌డికి క‌ల‌సి రావాల‌న్నారు. తాను కూడా హాజ‌రు అవుతాన‌ని ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు.