లద్దాఖ్ మంచుకొండల్లో అగ్గి పిడుగు.. ఎవరీ సోనమ్ వాంగ్ చుక్ ?
లద్దాఖ్ లో ఆందోళన అనంతరం ఢిల్లీని ముట్టడిస్తామని సోనమ్ ప్రకటించారు. దీంతో ఆయనను సెప్టెంబరు 26న పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు మోపారు.
By: Tupaki Political Desk | 7 Oct 2025 4:00 PM ISTలద్దాఖ్... భారతదేశంలో మరో రాష్ట్రం ( 30 లేదా 31వ) అవుతుందా? ఏమో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు..! 2019లో ఆర్టికిల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్, లద్దాఖ్ లను వేరే చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చాక వీటికి రాష్ట్ర హోదా కల్పించే అంశం తరచూ ప్రస్తావనకు వస్తోంది. కానీ, ఏదీ కాలేదు. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభావం అధికంగా ఉండే లద్దాఖ్ లో అనూహ్యంగా నిరసనలు మొదలయ్యాయి. దీనివెనుక ఉన్నది సోనమ్ వాంగ్ చుక్. లద్దాఖ్ లో హింస జరగడంతో ఆయనను అరెస్టు చేశారు.
ఢిల్లీని కదిలించారు..
లద్దాఖ్ లో ఆందోళన అనంతరం ఢిల్లీని ముట్టడిస్తామని సోనమ్ ప్రకటించారు. దీంతో ఆయనను సెప్టెంబరు 26న పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు మోపారు. అంతేకాదు.. సోనమ్ పాకిస్థాన్ సానుభూతిపరుడని, పెహల్గాం ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు మోపారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదంతా తెలిశాక సోనమ్ భార్య గీతాంజలి జె అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం.. మిగతా కేసుల విచారణను పక్కనపెట్టి మరీ సోనమ్ కేసును విచారించింది సుప్రీంకోర్టు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సోనమ్ కేసు గంట సేపు విచారించింది సుప్రీంకోర్టు. దీనికి సమయం కేటాయిస్తాం అంటూ మంగళవారం పూర్తి స్థాయి విచారణ చేపట్టింది.
సోనమ్ అరెస్టుకు ముందు నోటీసులు ఇచ్చారా? ఆయన భార్యకు తెలిపారా? ఈ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదా? అసలు కేంద్రమే ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెలా ప్రవర్తిస్తాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. సోమన్ కారణంగా జాతీయ భద్రతకు వచ్చిన ప్రమాదం ఏమిటని నిలదీసింది. దీనిపై వివరణ కోరింది. ఆయనకు పెహల్గాం దాడుల్లో పాత్ర ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించగా.. నిర్ద్వందంగా కొట్టివేసింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశాక అక్కడి ప్రజల తరఫున గళమెత్తుతున్నారు సోనమ్. ఈయన కశ్మీరీ పండిట్. తరచూ ఉద్యమాలతో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు. అక్కడి యంత్రాంగాన్ని ప్రశ్నించినందుకు పాక్ అనుకూలం అనే ముద్ర వేస్తుండడాన్ని నిలదీస్తున్నారు. కాగా, సోనమ్ విషయంలో కేంద్రానికి మంగళవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనమ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పాలని ఆయన కోరారు. కారణాలను ఆయనకే చెప్పామని, సోనమ్ భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ దశలో కేసు విషయమై తామేమీ చెప్పలేం అంటూ ఆదేశాల జారీకి ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 14కు తదుపరి విచారణను వాయిదా వేసింది.
