Begin typing your search above and press return to search.

దీక్ష విరమిస్తా... కానీ మూడు షరతులు.. సోనమ్ వాంగ్‌చుక్ మెలిక

దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకుండా నిరసన కొనసాగిస్తున్న కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షిణించింది.

By:  A.N.Kumar   |   20 July 2026 2:36 PM IST
దీక్ష విరమిస్తా... కానీ మూడు షరతులు.. సోనమ్ వాంగ్‌చుక్  మెలిక
X

లడఖ్‌ ఉద్యమ నేత, ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ తన పోరాటంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన ముందుంచిన మూడు ప్రధాన షరతుల్లో కనీసం ఒక్కదానినైనా నెరవేరిస్తేనే తాను నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన కేంద్రానికి తేల్చి చెప్పారు.

ఆస్పత్రి బెడ్‌పై నుంచే చేతిరాతతో లేఖ

దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకుండా నిరసన కొనసాగిస్తున్న కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షిణించింది. అయినప్పటికీ తన ఉద్యమ లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గబోనని ఆయన ఉద్ఘాటించారు. ఆస్పత్రి బెడ్‌పైనే చేతిరాతతో ఒక లేఖ విడుదల చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉండాల్సిన మాట్లాడే స్వేచ్ఛపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు కూడా కనీస అవకాశం లేకుండా చేయడం దురదృష్టకరం." అని సోనమ్ వాంగ్‌చుక్ విమర్శించారు.

సోనమ్ వాంగ్‌చుక్ విధించిన ఆ 3 కీలక షరతులు ఇవే

ప్రభుత్వం ముందు వాంగ్‌చుక్ ఉంచిన డిమాండ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ మూడు షరతులు చూస్తే.. ఒకటి దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఘటనలపై తక్షణమే స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. రెండోది తనతో పాటు సి.జె.పి నాయకులకు పార్లమెంటులోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తాను లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా చర్చిస్తామని ఎంపీలు అధికారికంగా హామీ ఇవ్వాలి. మూడోది ఒకవేళ తన ఆరోగ్యం మరింత క్షీణించి లేవలేని పరిస్థితి ఏర్పడితే పార్లమెంట్ సభ్యులే స్వయంగా ఆస్పత్రికి వచ్చి తన డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇవ్వాలి.

ఆరోగ్యంపై వైద్యుల ప్రత్యేక నిఘా

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా ఆయన శరీరంపై పడే ప్రభావాలను నిరంతరం పరీక్షల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినప్పటికీ ఈ దీక్ష మరికొంతకాలం ఇలాగే కొనసాగితే అంతర్గత ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది?

సోనమ్ వాంగ్‌చుక్ విధించిన ఈ మూడు కఠిన షరతులపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందా? లేక ఈ ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతుందా? అనేది రానున్న కొన్ని గంటల్లో తేలనుంది.