Begin typing your search above and press return to search.

‘కాక్రోచ్’లను అనుమానించిన సోనమ్ వాంగ్ చుక్

లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

By:  A.N.Kumar   |   31 Aug 2026 3:13 PM IST
‘కాక్రోచ్’లను అనుమానించిన సోనమ్ వాంగ్ చుక్
X

లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్ ముఖాముఖిలో ఆయన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ఉద్యమ నేతల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పేరుతో సాగే ఉద్యమాల వెనుక ఉండే నాయకుల రాజకీయ ఆశయాలు, వారి అసలు ఉద్దేశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

రాజకీయ ఆశయాలు ఉండటంలో తప్పులేదు కానీ..

సిజెపి నేతలను తాను చాలా కాలంగా.. ఎంతో దగ్గరగా పరిశీలిస్తున్నానని వాంగ్‌చుక్ తెలిపారు. తనకు తెలిసినంతవరకు వారిలో బలమైన రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో ఎవరికైనా రాజకీయ ఆశయాలు ఉండటం సహజమేనని.. అందులో ఎలాంటి తప్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఒక ప్రజా ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. రాజకీయ పార్టీలకు దూరంగా పూర్తి నిష్పాక్షికంగా న్యూట్రల్ గా ఉండటం ఎంతో ముఖ్యమని ఉద్యమ ప్రారంభంలోనే వారికి సూచించినట్లు వాంగ్‌చుక్ వెల్లడించారు. ఉద్యమం నిష్పాక్షికంగా ఉన్నప్పుడే దానికి సామాన్య ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తుందని ఆయన విశ్లేషించారు.

‘వారు సాధువులేమీ కాదు’

సిజెపి నాయకుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ప్రశ్నిస్తూ వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యల్లో ‘వారేం సాధువులు కాదు’ అన్న మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎలాంటి స్వార్థం లేదా రాజకీయ ప్రయోజనం ఆశించకుండా కేవలం ప్రజా సేవకే అంకితమయ్యే స్థాయిలో ఆ నేతలను తాను చూడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ నాయకులెవరూ తమ రాజకీయ ఆశయాలను స్వయంగా తనతో పంచుకోలేదని.. కేవలం ఒక పరిశీలకుడిగా తనకున్న అనుభవం బట్టే ఈ అభిప్రాయానికి వచ్చానని స్పష్టం చేశారు.

‘కాక్రోచ్‌’ల వెనుక అసలు అంతరార్థం

సంభాషణలో వాంగ్‌చుక్ వాడిన ‘కాక్రోచ్‌లు’ అనే పదం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రజా ఉద్యమాలలో నేరుగా కనిపించకుండా.. సమయాన్ని బట్టి తమ పాత్రను మార్చుకుంటూ వెనుక ఉండి ప్రయోజనాలు పొందే అవకాశవాద వ్యక్తులను ఉద్దేశించి ఈ పదాన్ని వాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు చూపించనప్పటికీ, ఆయన వ్యక్తంచేసిన ఈ అనుమానాలు ఉద్యమ నాయకత్వ విశ్వసనీయతపై పెద్ద ప్రశ్న గుర్తును మిగిల్చాయి.

ఉద్యమాలు.. రాజకీయాల మధ్య సరిహద్దు ఎక్కడ?

వాంగ్‌చుక్ వ్యాఖ్యలు ఇప్పుడు ఒక ప్రాథమిక ప్రశ్నకు తెరలేపాయి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులకు రాజకీయ ఆశయాలు ఉండకూడదా? పోరాటం ముగిసాక రాజకీయాల్లోకి రావడం సహజ పరిణామమే కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చరిత్రలో అనేకమంది ఉద్యమకారులు పీపుల్స్ లీడర్లుగా మారి రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉద్యమం నడుస్తున్న సమయంలోనే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే భావన ఏర్పడితే ఆ ఉద్యమం తన పవిత్రతను కోల్పోతుందని వాంగ్‌చుక్ పరోక్షంగా హెచ్చరించారు.

సమాజ హితం కోసం వచ్చే నాయకులు ప్రజా ఉద్యమాలను కేవలం తమ రాజకీయ ఎదుగుదలకు నిచ్చెనలుగా వాడుకోకూడదనే ఒక విలువైన సందేశాన్ని సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.