Begin typing your search above and press return to search.

అమీర్‌ ఖాన్ వర్సెస్ సోనమ్ వాంగ్‌చుక్.. ఎక్కడ చెడింది? అసలు మరిచిపోయేంత వివాదమేంటి?

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మధ్య కొనసాగుతున్న వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది.

By:  A.N.Kumar   |   30 Aug 2026 11:00 PM IST
అమీర్‌ ఖాన్ వర్సెస్ సోనమ్ వాంగ్‌చుక్.. ఎక్కడ చెడింది? అసలు మరిచిపోయేంత వివాదమేంటి?
X

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మధ్య కొనసాగుతున్న వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. ‘3 ఇడియట్స్’ సినిమాలోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్రకు సోనమ్ వాంగ్‌చుక్ జీవితం, ఆలోచనలు ప్రేరణగా నిలిచాయనే ప్రచారంపై ఇటీవల అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు వాంగ్‌చుక్ వ్యంగ్యంగా స్పందించారు. తామిద్దరం గతంలో కలవలేదని అమీర్ ఖాన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘గజినీ’ సినిమాలో అమీర్ పోషించిన పాత్రను గుర్తుచేశారు.

‘అమీర్‌కు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చి ఉండొచ్చు’

తాజా ఇంటర్వ్యూలో సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. తాను అమీర్ ఖాన్‌ను గతంలో కలిశానని స్పష్టం చేశారు. ఒక అవార్డు కార్యక్రమంలో తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని, చాలా విషయాలు, ఆలోచనలపై చర్చించుకున్నామని చెప్పారు.

అయితే అమీర్ ఖాన్ ఆ విషయాన్ని గుర్తుపట్టకపోవడానికి కారణం కూడా తనకు తెలుసని సరదాగా వ్యాఖ్యానించారు. అమీర్ ఆ సమయంలో ‘గజినీ’ సినిమా గెటప్‌లో ఉన్నారని, అందుకే ఆ సినిమాలోని పాత్రకు ఉన్నట్లుగానే ‘షార్ట్ టర్మ్ మెమరీ లాస్’ వచ్చి ఉండొచ్చని చమత్కరించారు. పాత్రల్లో పూర్తిగా లీనమైపోయే అమీర్.. ఆ సమావేశాన్ని కూడా మర్చిపోయి ఉండొచ్చంటూ చిరునవ్వుతో సెటైర్ వేశారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

2009లో విడుదలైన ‘3 ఇడియట్స్’ బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ ‘రాంచో’గా, అంటే ఫున్సుఖ్ వాంగ్డు పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు లడఖ్‌కు చెందిన శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిజ జీవితం, ఆయన ఆలోచనలు స్ఫూర్తిగా నిలిచాయనే ప్రచారం అప్పటి నుంచే ఉంది.

అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ దీనిపై స్పందించారు. సినిమా నిర్మాణ సమయంలో కానీ స్క్రిప్ట్ రాసే సమయంలో కానీ తనకు, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదని తాము ఆయనను కలవలేదని పేర్కొన్నారు.

వైరల్‌గా మారిన 2008 వీడియో

అమీర్ ఖాన్ వ్యాఖ్యల తర్వాత 2008 నాటి ఓ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రియల్ హీరోస్’ అవార్డు కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల్లో అమీర్ ఖాన్ కూడా కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా వింటున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే ఆ సమయంలో అమీర్ ‘గజినీ’ లుక్‌లో ఉన్నారు. ఈ వీడియో బయటకు రావడంతో అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. తాజాగా వాంగ్‌చుక్ చేసిన ‘గజినీ’ సెటైర్ కూడా ఈ నేపథ్యంలోనే వచ్చింది.

‘3 ఇడియట్స్ నా బయోపిక్ అని నేను చెప్పడం లేదు’

అయితే ఈ విషయాన్ని తాను వ్యక్తిగత వివాదంగా చూడటం లేదని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ‘3 ఇడియట్స్’ తన జీవిత చరిత్ర అని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఒకరి ఆలోచనలు, సంభాషణలు మనపై ప్రభావం చూపడం సహజమని పేర్కొన్నారు.

అవార్డు కార్యక్రమంలో అమీర్‌తో జరిగిన చర్చలోని కొన్ని ఆలోచనలు ఆయనకు నచ్చి ఉండవచ్చని, వాటిని తర్వాత తన టీమ్ లేదా రచయితలతో పంచుకుని ఉండొచ్చని వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా కథలో మార్పులు జరిగి ఉండవచ్చని, అది అనుకోకుండా జరిగినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

మొత్తానికి అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సోనమ్ వాంగ్‌చుక్ ఇచ్చిన ‘గజినీ’ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య అసలు పరిచయం ఎప్పుడు, ఏ సందర్భంలో జరిగింది? ‘3 ఇడియట్స్’ పాత్రకు వాంగ్‌చుక్ ఆలోచనలు ఎంతవరకు ప్రేరణగా నిలిచాయి? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.