Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లూ జాగ్రత్త.. కనీసం కప్పు టీ కూడా పైకెత్తలేరు!

ఈ నేపథ్యంలో ఓ న్యూరాలజిస్ట్ 'ఎక్స్' వేదికగా పంచుకున్న ఓ కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతోమందికి మెల్కొలుపు అనే కామెంట్లను సొంతం చేసుకుంది.

By:  Raja Ch   |   31 Oct 2025 5:00 AM IST
సాఫ్ట్  వేర్  ఇంజినీర్లూ  జాగ్రత్త.. కనీసం కప్పు టీ కూడా పైకెత్తలేరు!
X

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు, డెస్క్ వద్ద ఎక్కువ గంటలు అదేపనిగా పనిచేసేవారికి వెన్ను నొప్పి, స్థూలకాయంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వస్తాయని.. స్ట్రెస్ కు ఇవన్నీ అదనమని చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిపుణులకు.. కండరాల నొప్పి అనేది రోజువారీ చికాకుల జాబితాలో కొత్త సమస్యగా మారిపోయింది. అలాంటివారికి ఓ వేకప్ కాల్ ఇది!

అవును... సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు, గంటల తరబడి అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారికి కండరాల నొప్పి అనేది ఇప్పుడు రోజువారీ సమస్యల్లో ఒకటిగా మారిపోతోందని అంటున్నారు. తొలుత తేలికపాటి నొప్పిగా ప్రారంభమయ్యి.. ఆఖరికి టీకప్పు ఎత్తడం, జుట్టు దువ్వడం, వెనక్కి ఒళ్లు విరుచుకోవడం వంటివి భరించలేనివిగా మారిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ న్యూరాలజిస్ట్ 'ఎక్స్' వేదికగా పంచుకున్న ఓ కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతోమందికి మెల్కొలుపు అనే కామెంట్లను సొంతం చేసుకుంది. ఆయన పోస్ట్ యథావిదిగా చూద్దామ్...!

'ఒక సోమవారం ఉదయం నా క్లినిక్‌ లోకి రియా (పేరు మార్చబడింది) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వచ్చింది.. ఆమె కుడి మోచేయిలో నిరంతర నొప్పి తగ్గలేదని తెలిపింది. టైప్ చేస్తున్నప్పుడు, మౌస్ ఉపయోగిస్తున్నప్పుడు చిన్న అసౌకర్యంగా ప్రారంభమైన ఈ నొప్పి.. క్రమక్రమంగా తీవ్రమైంది. ఒక కప్పు టీ ఎత్తడం లేదా ఆమె జుట్టును దువ్వడం కూడా ఆమె మోచేయి బయట వైపున పదునైన నొప్పిని కలిగించే స్థాయికి చేరుకుంది'.

'ఈ క్రమంలో ఆమె పెయిన్ బామ్స్ ను ఆశ్రయించింది.. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించింది.. కంప్యూటర్ పని కోసం చేతులు మార్చింది.. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో.. నేను ఆమె లక్షణాలు టెన్నిస్ ఎల్బో లాగా ఉన్నాయని చెప్పినప్పుడు.. "నేను టెన్నీస్ కూడా ఆడను" అంటూ ఆమె సరదాగా నవ్వింది!'.. కంప్యూటర్ల వద్ద గంటల తరబడి గడిపే నిపుణులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది!'

ఈ సందర్భంగా... 'రియాకు ఇబ్బంది కలిగించే పనుల నుండి విరామం తీసుకోవాలని.. ఆమె వర్క్‌ స్టేషన్‌ ను సర్దుబాటు చేసుకోవాలని.. సాగదీయడం, బలోపేతం చేయడంతో పాటు క్రమంగా కోలుకోవడంపై దృష్టి సారించే ఫిజియోథెరపీ దినచర్యను అనుసరించాలని ఆమెకు సలహా ఇచ్చాను. రోజువారీ పని సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి ఆమెకు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల చిన్న కోర్సుతో పాటు టెన్నిస్ ఎల్బో పట్టీ కూడా సూచించబడింది.'

'తరువాతి కొన్ని వారాల్లో రియా కోలుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆమె తన కుర్చీ ఎత్తును సర్దుబాటు చేసుకుంది.. టైప్ చేస్తున్నప్పుడు తన మణికట్టుకు సపోర్ట్ ఇచ్చింది.. ప్రతి గంటకు చిన్నపాటి విరామం తీసుకుంది.. ఆరు వారాల రివ్యూ నాటికి.. ఆమె నొప్పి దాదాపుగా కనుమరుగైంది. ఆమె గ్రిప్ స్ట్రెంథ్ తిరిగి వచ్చింది. ఆమె తిరిగి పని చేయడం, హాయిగా వ్యాయామం చేయడం ప్రారంభించింది'! అని డాక్టర్ స్పష్టం చేశారు!

కాగా... ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు, కంప్యూటర్ ముందు అవిరామంగా గంటల సేపు కూర్చునే వారికి పని ఒత్తిడి కారణంగా వచ్చే మానసిక సమస్యలతో పాటు వెన్ను నొప్పి, స్థూలకాయం వంటి శారీరక సమస్యలు రెగ్యులర్ గా వస్తుంటాయనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో తాజాగా ఈ న్యూరాలజిస్ట్ చెప్పిన ఈ పోస్ట్ తో మిగిలినవారు ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చన్నమాట!!