సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ ప్రకటనలు.. అందరూ చేసే అతిపెద్ద తప్పు ఇదే
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అనుమానాస్పద ప్రాజెక్టుల ప్రకటనలను పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించిన అనుమతులు, భూ పత్రాలు, రెరా రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియను వేగవంతం చేశారు.
By: A.N.Kumar | 28 Sept 2026 1:37 PM ISTరియల్ ఎస్టేట్ రంగంలో సొంత ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసి మంచి రాబడి పొందాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో కొత్త రకం మోసాలు వెలుగుచూస్తున్నాయి. తక్కువ ధరకే విలాసవంతమైన విల్లాలు, అపార్ట్‌మెంట్లు, డిజిటల్ లేఅవుట్లు అందిస్తామంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికలుగా ఊరిస్తున్న ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల పెట్టుబడిదారులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో రంగురంగుల బ్రోచర్లు, అధునాతన గ్రాఫిక్ వీడియోలు చూపిస్తూ నిరుద్యోగులను, మధ్యతరగతి ప్రజలను సులభంగా ఆకర్షిస్తున్నారు. "పరిమిత కాల ఆఫర్", "తొలుత బుక్ చేసుకున్న కొద్దిమందికే ఈ ప్రత్యేక ధర" అంటూ కొనుగోలుదారులపై మానసిక ఒత్తిడి పెంచి అత్యవసరంగా అడ్వాన్స్ మొత్తాలను వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి చట్టబద్ధమైన అనుమతులు రాకముందే 'ప్రీ-లాంచ్' లేదా 'ప్రీ-సేల్స్' పేరుతో కోట్ల రూపాయల నిధులను సేకరిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే భూమి లభిస్తుందనే ఆశతో కనీస వివరాలు సరిచూసుకోకుండా డబ్బులు చెల్లించి.. ఆ తర్వాత ప్రాజెక్టులు ప్రారంభం కాక అనేకమంది ఆర్థికంగా దెబ్బతింటున్నారు.
అసలు సమస్య ప్రాజెక్టుకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు, నిబంధనలు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించకుండానే వ్యాపారులను నమ్మడంలో మొదలవుతోంది. హెచ్‌ఎమ్‌డీఏ, డిటిసిపి వంటి స్థానిక ప్రణాళికా సంస్థల లేఅవుట్ అనుమతులు లేకపోవడం, రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండానే అమ్మకాలు సాగించడం ప్రధాన ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియా ప్రకటనల్లో, వీడియోల్లో చూపించిన ప్రదేశానికి, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి మధ్య భారీ వ్యత్యాసాలు ఉండే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో యాజమాన్య హక్కులు సరిగ్గా లేని వివాదాస్పద భూములను చూపిస్తూ అడ్వాన్సులు తీసుకుని మాయమవుతున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి.
ఈ తరహా అక్రమ రియల్ ఎస్టేట్ ప్రచారాలపై అధికారులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అనుమానాస్పద ప్రాజెక్టుల ప్రకటనలను పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించిన అనుమతులు, భూ పత్రాలు, రెరా రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియను వేగవంతం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు గుప్పించే సంస్థలు, వ్యక్తులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు, ప్రచార వీడియోలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా ప్రాజెక్టులో డబ్బులు పెట్టే ముందు సంబంధిత రాష్ట్ర రెరా అధికారిక పోర్టల్‌లో ఆ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయో లేదో స్వయంగా తనిఖీ చేసుకోవాలి. భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల పత్రాలు , లింక్ డాక్యుమెంట్లు, లేఅవుట్ అనుమతి పత్రాలను నిపుణులైన లీగల్ అడ్వైజర్లతో ధృవీకరించుకోవడమే కాకుండా.. స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి స్థలాన్ని పరిశీలించిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపడం సురక్షితం. తక్కువ ధర అనే ఆకర్షణ కంటే చట్టబద్ధమైన అనుమతులు, పెట్టుబడి భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం.
