Begin typing your search above and press return to search.

అబ్రాడ్‌లోనూ కులం గోల.. వైరల్ అవుతోన్న యువతి ఆవేదన

తాజాగా ఒక ఎన్నారై యువతి సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Political Desk   |   6 Jun 2026 10:00 PM IST
అబ్రాడ్‌లోనూ కులం గోల.. వైరల్ అవుతోన్న యువతి ఆవేదన
X

చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఏడెనిమిది వేల మైళ్లు దాటి విదేశాలకు వెళ్తాం. అక్కడ అత్యాధునిక సాంకేతికతను చూస్తాం, విభిన్న సంస్కృతులను గౌరవిస్తాం, గ్లోబల్ సిటిజన్స్‌గా ఎదుగుతాం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే లగేజీ సర్దుకునేటప్పుడే మనవాళ్లు కొందరు కుల పిచ్చిని కూడా సూట్‌కేసుల్లో పెట్టేసుకుని తీసుకెళ్తున్నట్టున్నారు. తాజాగా ఒక ఎన్నారై యువతి సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మాట్లాడిన పది నిమిషాలకే ఏ కులం?

‘‘అబ్రాడ్‌లో చూసిన క్యాస్ట్ ఫీలింగ్ నేనెక్కడా చూడలేదు. ఇండియాలో కూడా కుల పిచ్చి ఈ స్థాయిలో ఉండదేమో.. మాట్లాడిన పది నిమిషాల్లోనే ఏ క్యాస్ట్? అంటూ అడుగుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. చాలా మంది ఇలానే తయారయ్యారు. ఇలాంటివి విన్నప్పుడు నాకు మండిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారురా బాబూ వీళ్లంతా?’’ అంటూ సదరు యువతి వీడియోలో పెల్లుబికిన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం "నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం తల్లి అంటూ మద్దతు తెలుపుతున్నారు.

గ్లోబల్ సిటిజన్స్.. కానీ లోకల్ మైండ్‌సెట్!

అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యవస్థలను, అక్కడి సంస్కృతిలోని మంచిని అలవర్చుకోవాలి. కానీ, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్థిరపడిన కొందరు భారతీయులు ఇప్పటికీ 18వ శతాబ్దం నాటి కుల వ్యవస్థను పట్టుకుని వేలాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రూమ్ షేరింగ్ దగ్గరి నుంచి, ఫ్రెండ్షిప్స్, వీకెండ్ పార్టీలు, చివరికి ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్ల వరకు ‘మనవాడా? కాదా?’ అని చూసుకునే జబ్బు విదేశాల్లో మరీ ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. పెద్ద చదువులు చదివి, లక్షల జీతాలు తీసుకుంటున్నప్పటికీ.. మెదడులో మాత్రం ఇంకా ఆ కులపు మురికిని వదిలించుకోలేకపోవడం మన సంస్కారానికే ఒక మాయని మచ్చగా వ్యాఖ్యానిస్తున్నారు.

మార్పు ఎక్కడ రావాలి?

పరాయి దేశంలో ఉన్నప్పుడు తోటి భారతీయుడికి కష్టం వస్తే ‘మనోడు’ అని ఆదుకోవాలే తప్ప, ‘ఏ కులం’ అని ఆరా తీయడం ఎంతవరకు సమంజసం? కుల, మతాలకు అతీతంగా ఎదిగిన దేశాల్లో ఉంటూ, ఇంకా ఇలాంటి వివక్షా పూరిత ఆలోచనలతో బతకడం మనం మన దేశానికి, మన సంస్కృతికి చేసే ద్రోహంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా యువత ఇలాంటి సంకుచిత భావాలను గట్టిగా తిప్పికొట్టాలని కోరుకుంటున్నారు. కులం చూసి గౌరవం ఇవ్వడం కాదు.. వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించడం నేర్చుకోవాలి. డాలర్లు సంపాదించడం మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్ ఆలోచనలను కూడా అలవర్చుకున్నప్పుడే మన చదువులకి, మన ఎదుగుదలకి ఒక అర్థం ఉంటుందని గుర్తించాలని అంటున్నారు.