విశ్వాసం కోల్పోతున్న సోషల్ మీడియా? ఇవీ రీజన్లు!
సోషల్ మీడియా ఇప్పుడు ప్రజల అరచేతిలో వార్తలను అందించడంతో పాటు అనేక విషయాలను క్షణాల్లో చేరువ చేస్తున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 11 Nov 2025 3:14 PM ISTసోషల్ మీడియా ఇప్పుడు ప్రజల అరచేతిలో వార్తలను అందించడంతో పాటు అనేక విషయాలను క్షణాల్లో చేరువ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాను రాను సోషల్ మీడియా మరింత విశ్వసనీయతను విశ్వాసాన్ని పెంచుకోవాలి. అయితే.. అదే విశ్వాసాన్ని అదే విశ్వసనీయను రాను రాను కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జరిగిన రెండు మూడు ఉదాహరణలు దీనికి అద్దం పడుతున్నాయి. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పెద్ద యాగీ సృష్టించింది.
దీనిపై ఆయన కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వివరణ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇంకా ఈ తరహా పరిస్థితి మారడం లేదు. మరో వైపు ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుళ్లలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే,, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్‌కు ముందు జరిగిన పహల్గాం ఉగ్రవాద ఘటనకు దీనికి లింకు పెట్టి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీనివల్ల ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై కేంద్ర హోమ్ శాఖ తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా సంయమనం పాటించాలని పేర్కొంది. ఇక, బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇలా లేనిపోని విషయాలను లేదా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా సోషల్ మీడియా వ్యవహరిస్తుండటం పట్ల సామాజిక ఉద్యమకారులు, మేధావులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, కేంద్ర ప్రభుత్వం కూడా తాజా పరిణామాలపై తీవ్రంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్లపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను, వ్యాఖ్యలను, పోస్టులను నిశితంగా గమనిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెప్పడం విశేషం. ఏదేమైనా ప్రజలకు అరచేతిలో అందుబాటులో ఉన్న సోషల్ మీడియా విశ్వసనీయతను రోజురోజుకు తగ్గించుకోవడం వల్ల మరింత ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ప్రస్తుతం ప్రధాన మీడియా కంటే కూడా.. సోషల్ మీడియాపై ప్రజలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో విశ్వసనీయతను కోల్పోవద్దని చెబుతున్నారు.
