Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా డిటాక్స్ లో పాల్గొనండి... రిజల్ట్ ఇలా ఉంటుంది చూడండి!

ఈ సందర్భంగా స్పందించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో అసోసియేట్ ప్రొఫెసర్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ లో డిజిటల్ సైకియాట్రీ విభాగం డైరెక్టర్ అయిన ప్రధాన రచయిత జాన్ టోరస్...

By:  Raja Ch   |   21 Dec 2025 10:06 AM IST
సోషల్  మీడియా డిటాక్స్  లో పాల్గొనండి... రిజల్ట్  ఇలా ఉంటుంది చూడండి!
X

ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జనాలు వీలైనంత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన యాప్స్ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో.. ఏ యాప్ లోనూ మిస్సవ్వకుండా బిజీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటే కలిగే ప్రయోజనాలపై ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అవును... జేఏఎంఏ నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన యువకులపై జరిపిన అధ్యయనంలో.. సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... ఒక వారం పాటు సోషల్ మీడియా డిటాక్స్ లో పాల్గొన్న వారి మానసిక ఆరోగ్యంలో పెరుగుదల కనిపించిందని.. ఆందోళన లక్షణాలు 16.1%, నిరాశ 24.8%, నిద్రలేమి 14.5% సమస్యలు తగ్గాయని వెల్లడైంది.

ఈ సందర్భంగా స్పందించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో అసోసియేట్ ప్రొఫెసర్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ లో డిజిటల్ సైకియాట్రీ విభాగం డైరెక్టర్ అయిన ప్రధాన రచయిత జాన్ టోరస్... ఈ పరిశోధనా ఫలితాలు ఒక పెద్ద పరిశోధన ప్రయత్నంలో మొదటి దశ మాత్రమే అని అన్నారు. అయితే.. ఈ ప్రారంభ ఫలితాలే తనను ఆశ్చర్య పరిచాయని చెబుతూ.. దాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో తమ ప్రాథమిక లక్ష్యం.. ప్రజలు సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారు ఎలా భావిస్తున్నారో తెలుసుకోవడంతో పాటు వారు రియల్ టైం మార్పులను అర్ధం చేసుకోవడానికి సోషల్ మీడియా డిటాక్స్ ను ఉపయోగించడం అని తెలిపారు. ఈ సమయంలో ఈ మార్పులను రికార్డ్ చేయడానికి, ఏమి జరుగుతుందో చూడటానికి ఫోన్ తమకు సహాయపడుతుందని.. తాము రెండు వారాల పాటు సహజ వినియోగాన్ని కొలిచామని, తర్వాత డిటాక్స్ ని అనుసరించామని తెలిపారు.

ఈ సందర్భంగా తాము కనుగొన్నది చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పిన జాన్ టోరస్.. మొదటి రెండు వారాలు, ప్రజలు రోజుకు రెండు గంటలు సోషల్ మీడియాను ఉపయోగించారని కనుగొన్నామని.. డీటాక్స్ సమయంలో సోషల్ మీడియా సమయం 1.9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిందని తాము గుర్తించామని అన్నారు. ఇది చాలా పెద్ద తగ్గుదల అని తెలిపారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మొత్తం స్క్రీన్ సమయం కూడా దాదాపు ఒకే విధంగా ఉందని వెల్లడించారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియా వాడకాన్ని ఆపమని ప్రజలకు చెప్పడం కాదని.. నిద్ర విలువను ప్రజలు గుర్తించేలా చేయడం కూడా అని అన్నారు. నిద్ర మీ బలహీనత.. మెరుగైన నిద్రపై దృష్టి పెడదాం అని చెప్పాలనుకుంటున్నామని అన్నారు!